ఈ సంక్రాంతి రేసు నుంచి... `భీమ్లా నాయక్` తప్పుకున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ వాయిదా పడడం... ఆర్.ఆర్.ఆర్ కి బాగా కలిసొచ్చే విషయం. ఎందుకంటే... ఆర్.ఆర్.ఆర్ 7న వస్తే, భీమ్లా 12న రావాలి. అంటే.. రెండు సినిమాల మధ్య గ్యాప్ కేవలం 4 రోజులే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్... వసూళ్ల పరంగా నిలదొక్కుకోవాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా... సోలో రిలీజ్ అవ్వడం చాలా ముఖ్యం.
అయితే... సంక్రాంతి సీజన్ కాబట్టి సోలో రిలీజ్ కుదరని పని. కాకపోతే.. రెండు సినిమాలతో పోటీ పడడం `ఆర్.ఆర్.ఆర్`ని బాగా ఇబ్బంది పెట్టే విషయం. అందుకే.. పట్టుబట్టి మరీ.. `భీమ్లా నాయక్`ని వాయిదా వేయించారు. ఈ విషయంలో రాజమౌళి చేసిన కృషి అంతా ఇంతా కాదు. భీమ్లా నాయక్ ని తప్పించడానికి ఆయన చాలా రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి విజయం సాధించారు.
కానీ... ఈ విషయమై.. రాజమౌళి `భీమ్లా నాయక్` బృందానికి కృతజ్ఞతలు చెప్పే తీరు పవన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. సినిమా వాయిదా పడినందుకు తన ఆనందం వ్యక్తం చేస్తూ రాజమౌళి ఓ ట్వీట్ చేశారు. అందులో సర్కారు వారి పాట సినిమాని ప్రస్తావించారు. ఆసినిమా సంక్రాంతి సినిమానే అయినా, ఆర్.ఆర్.ఆర్‌కి దారి ఇవ్వడానికి వేసవికి వాయిదా వేశారంటూ..రాజమౌళి పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే... సర్కారు వారి పాట సినిమాని సంక్రాంతి కి తీసుకుని రావాలనుకున్నది నిజమే కావొచ్చు. కానీ... ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
భీమ్లా నాయక్‌తో పోటీ పడడం ఇష్టం లేక, ఆసినిమా వాయిదా పడింది. అంతే తప్ప... ఆర్.ఆర్.ఆర్‌కి చోటు ఇవ్వాలనికాదు. అయితే.. తన ట్వీట్ లో సర్కారు వారి పాటని ముందు పేర్కొని, ఆ తరవాత చివర్లో భీమ్లా నాయక్‌ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి ఈ సంక్రాంతి సీటు త్యాగం చేసింది భీమ్లా నాయక్‌నే. దాన్ని ప్రస్తావించడం మానేసి, మిగిలిన సినిమాల్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం, తన ట్విట్టర్ నుంచి పవన్ కి ట్యాగ్ చేయకపోవడం ఫ్యాన్స్ హర్టయ్యేలా చేసింది. పవన్ చేసిన త్యాగాన్ని రాజమౌళి గుర్తించలేదని, తనని తన సినిమా ప్రయోజనాలే ముఖ్యమని.. రాజమౌళిని ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.