ENGLISH

జూనియర్‌ పవర్‌స్టార్‌ అంటే తప్పేంటీ.?

19 June 2018-17:45 PM

రామ్‌చరణ్‌ని మొదట్లో జూనియర్‌ మెగాస్టార్‌ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తనయుడు బాలయ్యని కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని అన్నారు అప్పట్లో. అయితే ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మనవడు తారక్‌ అయ్యాడులే కానీ.. ఇలా వారసుల్ని జూనియర్‌ అనడంలో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఓ తల్లికి అలా పిలవడం తప్పుగా కనిపించిందట. 

ఆమె ఎవరో కాదు, 'బద్రి', 'జానీ' సినిమాల్లో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించి, ఆ పవన్‌కే భార్య అయిన రేణూదేశాయ్‌. ఆ తర్వాతి కాలంలో పవన్‌ నుండి విడాకులు తీసుకుని, ఫ్యామిలీ నుండి సెపరేట్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇదంతా వేరే విషయం. ఇకపోతే అసలు వివరాల్లోకి వెళితే, తాజాగా రేణూదేశాయ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫోటో వేరెవరిదో కాదు, రేణూదేశాయ్‌ - పవన్‌ కళ్యాణ్‌ దంపతుల తొలి సంతానమైన అకీరానంద్‌ది. ఈ ఫోటోని రేణూదేశాయ్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

ఈ ఫోటో చూసిన అభిమానులు, 'జూనియర్‌ పవర్‌స్టార్‌' అని ముద్దుగా సంబోధించారు. ఆ సంబోధనను తల్లిగా రేణూదేశాయ్‌ జీర్ణించుకోలేకపోతోందట. అలా తన కొడుకును పిలవొద్దనీ, అలా పిలవడం తనకిష్టం లేదనీ, అలాగే అకీరాకి కూడా ఇష్టం లేదనీ, ఆ మాటకొస్తే, పవన్‌ కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదనీ చెబుతోంది. అయినా పిలిచినంత మాత్రాన అకీరా, పవన్‌ కళ్యాణ్‌ అయిపోడు కదా. 

హీరోగా ఆ రేంజ్‌లో సత్తా చాటి, తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలి. పవన్‌ రక్తం పంచుకుని పుట్టిన అకీరానందన్‌, పవన్‌ అంత ఎత్తుకి ఎదగాలని అభిమానులు కోరుకోవడం తప్పు కాదు కదా, ఓ సినీ నటిగా రేణూదేశాయ్‌ అభిమానుల అభిరుచిని గౌరవిస్తే, వివాదాలకి ఆస్కారముండదు. ఈ విషయాన్ని రేణూదేశాయ్‌ గమనించి తీరాలి.

ALSO READ: అనసూయని విచారించిన ఇంటర్ పోల్?!