ఈనెల 17న పుష్ప విడుదల కానుంది. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నది అభిమానుల నమ్మకం. చిత్రబృందం కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ.. వాళ్లని భయపెడుతున్న అంశం ఒక్కటే. టికెట్ రేట్ల గొడవ. తెలంగాణలో ఫర్వాలేదు గానీ, ఏపీలో టికెట్ రేట్లు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడున్న రేట్లకు ఏపీలో సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేదు. కానీ పెద్ద సినిమాలకు మరో గత్యంతరం లేదు. పుష్పని దాదాపుగా 180 కోట్లకు అమ్మేశారు. ఈ డబ్బులు మామూలుగానే తిరిగి రాబట్టడం చాలా కష్టం. సినిమా సూపర్ డూపర్ హిట్టయితే తప్ప, బయ్యర్లు గట్టెక్కరు, అలాంటిది... ఏపీలో ఇప్పుడున్న రేట్లకు అయితే అసాధ్యమనే చెప్పాలి.
అందుకే పుష్ప టీమ్ లో కలవరం మొదలైంది. టికెట్ రేట్లు పెంచకపోతే.. ఏపీలో పుష్ప గట్టెక్కడం చాలా కష్టం. బాహుబలి రేంజులో ఉంటే తప్ప పెట్టుబడి రాబట్టలేరు. అందుకే చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నార్ట. మైత్రీ మూవీస్ నిర్మాతలు జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. స్పెషల్ షోలు, ఫ్యాన్స్ షోలకు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా.. టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటైనా కల్పించమని ప్రాధేయ పడబోతున్నార్ట. జగన్ కనికరిస్తే సరే సరి. లేదంటే.. రిస్క్ తీసుకుని, విడుదల చేసేసి, దేవుడిపైనే భారం వేయాలి. మరి జగన్ అప్పాయింట్‌మెంట్ దొరకడం అంత ఈజీనా?