ENGLISH

డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ & రేటింగ్

15 August 2024-16:52 PM

చిత్రం: డబుల్ ఇస్మార్ట్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
కథ - రచన : పూరి జగన్నాథ్


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్యా థాపర్. 


నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్


సంగీతం: మణి శర్మ 
సినిమాటోగ్రఫీ : జియాని గియాన్నెల్లి , శ్యామ్ కె నాయుడు  
ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్ 


బ్యానర్: పూరి కనెక్ట్స్ 
విడుదల తేదీ: 15 ఆగస్ట్ 2024  
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5

 

చాలా రోజులుగా రామ్ కి సరైన హిట్ లేదు. రామ్ సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప కెరియర్ పుంజుకునే మూవీ లేకపోవటంతో 'డబుల్ ఇస్మార్ట్' కోసం రామ్ ఫుల్ కాన్సంట్రేషన్ చేసి హార్డ్ వర్క్ చేసాడు. పూరికి కూడా  అర్జెంట్ గా హిట్ అవసరం. అందుకే తనకి కిక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించాడు. లైగర్ పరాజయం తరవాత పూరి కెరియర్ అయోమయంలో పడిపోయింది. దీనితో ఫుల్ ఎఫర్ట్ పెట్టి పూరి డబుల్ ఇస్మార్ట్ ని తీర్చి దిద్దాడు. ఐదేళ్ల క్రితం 2019లో విడుదల అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. రామ్ కెరియర్ లో ఇప్పటికీ అదే హయ్యస్ట్ గ్రాసర్. పూరి జగన్నాథ్‌కు కూడా అదే చివరి హిట్.  ఆ తర్వాత వీరిద్దరికి కలిసి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో సీక్వెల్ తో రిపీట్ అయ్యింది.  'డబుల్ ఇస్మార్ట్' నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుంది. పూరి , రామ్ కాంబో హిట్ అయిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.   


కథ :

'ఇస్మార్ట్ శంకర్‌' మూవీలో మెదడులో మెమరీ ట్రాన్సఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే  తరహాలోనే  డబుల్ ఇస్మార్ట్ కూడా 'మెమోరీ ట్రాన్సఫర్' చుట్టూ తిరుగుతుంది. బిగ్ బుల్ (సంజయ్ దత్) ఒక ఇంటర్నేషనల్ డాన్. తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు. కానీ అనుకోకుండా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మూడు నెలల కంటే ఎక్కువ బతకడని తెలుస్తుంది. దానికి అసలు ట్రీట్ మెంట్ కూడా లేదని డాక్టర్లు చెప్తారు. ఎలాగైనా బతకాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బిగ్ బుల్‌కి ఒక సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెప్తాడు. ఈ క్రమంలో చేసిన ప్రయోగాలన్నీ ఫెయిల్  అవుతూ ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రయోగం సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుంటారు. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకొచ్చి తనకి మెమరీ ట్రాన్స్ ఫర్ చేస్తారు. బిగ్ బుల్ ని దోచేయటానికి జన్నత్ (కావ్యా థాపర్) కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ కూడా తన టార్గెట్ బిగ్ బుల్ అని చెబుతుంటాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇస్మార్ట్ శంకర్ బిగ్ బుల్ గా మారాడా? అసలు బిగ్ బుల్ ఎవరు? ఇస్మార్ట్ శంకర్ తల్లి పోచమ్మకి (ఝాన్సీ), బిగ్ బుల్ కి సంబంధం ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

 

విశ్లేషణ: 

ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ వర్కవుట్ అవ్వకపోయినా సినిమా హిట్ అవ్వడం అన్నది ఇస్మార్ట్ శంకర్‌కే చెల్లింది.  కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీద హిట్ అయిన మూవీ 'డబుల్ ఇస్మార్ట్'  మొదటి పార్ట్ లో రామ్ ఎనర్జీ ఎలా ఉందో అంతకుమించి ఉంది సెకండ్ పార్ట్ లో రామ్ యాక్షన్. మొదటి పార్ట్ లో లేని ఎమోషన్ టచ్ ని ఈసారి డబుల్ ఇస్మార్ట్ కి అద్దారు పూరి. గోల్ అంటూ ఏది లేకుండా సాగిన ఇస్మార్ట్ శంకర్‌కు, సినిమా స్టార్టింగ్ నుంచి ఒక గోల్ తో సాగే డబుల్ ఇస్మార్ట్ కనిపిస్తుంది. హీరో పాత్రకి ఒక ఎమోషన్ ఉంటుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ లో మంచి పాయింట్ ఉంది. కానీ ఇస్మార్ట్ శంకర్ లాంటి హైపర్ క్యారెక్టర్‌కు ఒక బలమైన ఎమోషన్ పడితే దాని నుంచి మంచి డ్రామా పండుతుంది. కానీ దాన్ని ఎఫెక్టివ్‌గా రాసుకోవడంలో పూరి ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ ఇస్మార్ట్ శంకర్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ విలన్ ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్, హీరో హీరోయిన్ ల లవ్ ట్రాక్ స్లో గా నడుస్తుంది. ఇంటర్ వెల్ టైంకి అసలు కథ ప్రారంభం అవుతుంది. సెకండాఫ్‌లో కథ స్పీడ్ అందుకుంటుంది. విలన్ కి ఒక గోల్, హీరోకి ఒక గోల్ ఉండటం వాటి గురించి ఆడియన్స్ కి తెలిసినపుడు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్  ఊహించిన విధంగానే ఉంటుంది.  పూరి ప్రతి సినిమాలో అలీకి మంచి పాత్ర పడుతుంది. కానీ ఈ మూవీలో అలీ పాత్ర విసుగు తెప్పిస్తుంది. కావాలని చొప్పించినట్టు ఆ పాత్ర తీరు తెన్నులు అనిపిస్తాయి తప్ప కామెడీ పంచలేదు. పూరి రైటింగ్ ఇంత దిగజారిపోయిందా అనిపించక మానదు అలీ క్యారక్టర్ చూస్తే . ప్రగతి పాత్ర కూడా అంతే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది.  టోటల్ గా డబుల్ ఇస్మార్ట్ పూరి మార్కుని చూపించ లేకపోయాడు. రా ఏజెన్సీని సిల్లీగా చూపించి, పూరి విమర్శలకి గురయ్యారు.       

 

నటీ నటులు:

ఇస్మార్ట్ శంకర్ పాత్ర కోసం రామ్ చేసిన హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తుంది. ఈ మూవీలో ఈ పాత్ర  కోసం రామ్ ప్రాణం పెట్టి నటించాడు.  ఎంత క్లాస్ గా ఉండే రామ్ ప్రతి సీన్ లోను ఊర మాస్ యాక్షన్ తో, డైలాగ్స్ తో ఇస్మార్ట్ శంకరే కనిపిస్తాడు. ఇస్మార్ట్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు రామ్. నిజంగానే పూరి ఏదో స్పెషల్ చిప్‌తో రామ్ ని డిజైన్ చేసినట్టు నటించాడు. ఈ పాత్రకి రామ్ ని తప్ప ఎవర్నీ ఊహించలేము. ‘డబుల్ ఇస్మార్ట్’ పూర్తి స్థాయిలో రామ్ సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.  అసలు ఆ మాత్రం కలక్షన్స్ వస్తాయంటే కేవలం రామ్ నటన , ఎనర్జీ, డాన్స్ ల వలనే కానీ పూరి మార్క్ ఏం లేదు. మణి శర్మ మాస్ బీట్ కి రామ్ డాన్స్ లతో కిక్కిచ్చాడు. బాలివుడ్ లో ఒకప్పుడు విభిన్న చిత్రాలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన సంజయ్ ఇలాంటి చీప్ క్యారక్టర్ లో కనిపించటం హర్షించ దగ్గ విషయం కాదు. బిగ్ బుల్ పాత్రకి సంజయ్ దత్ లాంటి నటుడు అవసరం లేదు. తెలుగు సినిమాల క్రేజ్, సౌత్ సినిమాల్లో హీరో కి సమానంగా విలన్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని సంజయ్ ఈ పాత్రకి ఒప్పుకుని ఉంటాడు. రామ్ తరవాత చెప్పుకో దగ్గ పాత్ర జన్నత్ ది. ఈ సినిమాలో కావ్య థాపర్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్‌ పాత్రలో నటించింది. కావ్య థాపర్ గ్లామర్ గాళ్ గా అలరిస్తూనే కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించింది. డాన్స్ లో కూడా రామ్ తో పోటీ పడి చేసింది. మిగతా నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. షాయాజీ షిండే లాంటి నటుడ్ని రా ఆఫీసర్ గా చూపించి, ఆ పాత్రని కామెడీ చేసి పడేసాడు పూరి.    

 

టెక్నికల్ :

టెక్నికల్ విషయాలకి వస్తే దర్శకుడిగా పూరి అంతగా మెప్పించలేకపోయాడు. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కి నచ్చటంతో బీసీ సెంటర్లో హిట్ అయింది. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా సేమ్ కథనే వండి వార్చాడు. పూరి మార్క్ డైలాగ్స్ ఎక్కడా లేవు. ఆలోచింప చేసే మెసేజ్ లేదు సరికదా ఫ్యామిలీ తో కలిసి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కారణం బీప్ లు ఎక్కువే ఉన్నాయి. పూరి మళ్ళీ నిరాశ పరిచాడని చెప్పొచ్చు. కొత్తగా ఏమి చెప్పింది లేదు.  మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తమన్ , దేవి శ్రీ రాకతో కెరియర్ లో డౌన్ అయిన మణిశర్మకి ఇది మంచి హైపు తెచ్చే చిత్రం అవుతుంది. ఈ మూవీ తరవాత మళ్ళీ మణి శర్మకి ఛాన్స్ లు రావొచ్చు.  డబుల్ ఇస్మార్ట్ కి  మొదటి హీరో రామ్ అయితే సెకండ్ హీరో మణి శర్మ అని చెప్పొచ్చు. రామ్ ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ మ్యూజిక్ తో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. పాటలు ఆడియన్స్ ని అలరించాయి. 'మార్ ముంత చోడ్ చింతా' సాంగ్ థియేటర్స్ లో  హైలెట్ అయ్యింది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా లేవు. 25 కోట్లు క్యాస్టింగ్ కోసం ఖర్చు చేసిన పూరీ ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ పై శ్రద్ద  పెట్టలేదు. పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అందించాడు అంతే. 

 


ప్లస్ పాయింట్స్ 

రామ్ పోతినేని 
కావ్య థాపర్ 
మణి శర్మ 

 

మైనస్ పాయింట్స్ 

పూరి జగన్నాథ్ 
అలీ కామెడీ 
డబుల్ మీనింగ్ డైలాగ్స్ 

 

ఫైనల్ వర్దిక్ట్: పూరి మార్క్ లేని ఇస్మార్ట్

ALSO READ: IN ENGLISH