చిత్రం: మిస్టర్ బచ్చన్
దర్శకత్వం: హరీష్ శంకర్
కథ - రచన : హరీష్ శంకర్
నటీనటులు: రవి తేజ, భాగ్య శ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య
నిర్మాతలు: టీ.జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచి బోట్ల
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 15 ఆగస్టు 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
ఈ మధ్య రవి తేజ వరుస సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి. ధమాకా తరవాత చెప్పగోదగ్గ హిట్ లేదు. దీనితో తనకి రెండు హిట్లిచ్చిన హరీష్ శంకర్ నే నమ్ముకున్నాడు. ఈ క్రమంలోనే హిందీలో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన రైడ్ మూవీని తెలుగులో మిస్టర్ బచ్చన్ గా తెరకెక్కించారు. పేరుకి రీమేక్ అన్న మాట కానీ మొత్తం మార్చినట్లు హరీష్ తెలిపారు. ఇక్కడ నేటివిటీ కి తగ్గట్టు తీర్చి దిద్దామని పేర్కొన్నారు. గద్దలకొండ గణేష్ తరవాత హరీష్ నుంచి వస్తున్న మూవీ ఇదే కావటంతో ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా హరీష్ రీమేక్ లని కూడా తన స్టయిల్ లో తెరకెక్కించి మార్క్స్ కొట్టేస్తాడు. ఇందుకు ఉదాహరణ గద్దలకొండ గణేష్ , గబ్బర్ సింగ్. దీనితో ఇంకోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? అని ఆడియన్స్ వెయిట్ చేసారు. మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15 న థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీ ఎలా ఉంది. రీమేక్ రాజా పాస్ అయ్యాడా లేదా? రవి తేజ ఎనర్జీకి , హరీష్ మాస్ యాక్షన్ ఎంతవరకు మెప్పించింది రివ్యూలో చూద్దాం.
కథ :
షోలే సినిమా చూసి అమితాబ్ అంటే ఉన్న ఇష్టంతో కొడుక్కి ఆనంద్ అని పేరుని తీసేసి బచ్చన్ అని పెడతాడు తనికెళ్ళ భరణి . బచ్చన్ కి (రవితేజ) చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలంటే పిచ్చి. మంచి సింగర్ కూడా. సొంత వూర్లో ఆర్కెస్ట్రా నడుపుతుంటాడు. బచ్చన్ కుమార్ సాను పాటలు పాడటంలో స్పెషలిస్ట్. తనకి కోటిపల్లి కుమార్ సాను అనే పేరు కూడా వుంటుంది. బచ్చన్ పెద్దయ్యాక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అవుతాడు. నిజాయితీ, దైర్యం ఉన్న ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్‌గా బచ్చన్ చాలా రైడ్స్ చేసి వందల కోట్ల నల్లధనాన్ని పట్టుకుంటాడు. నిజాయితీ ఎవరికైనా కష్టాలే కదా కొని తెస్తుంది. అలాంటి పరిస్తితులోనే బచ్చన్‌ను ఓ రైడ్ లో సస్పెండ్ చేస్తారు. ఆ తరువాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరికి వెళ్లి ఆర్కెస్ట్రాను కంటిన్యూ చేస్తుంటాడు. ఈక్రమంలోనే ఊర్లో జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పెళ్లి పీటలకు మీదకు వచ్చే సమయానికి బచ్చన్ కి కాల్ వస్తుంది. మరో వైపు ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) అరాచకాలు మితి మీరి పోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హత మార్చుతుంటాడు. విధి లేక దమ్ము దైర్యమున్న బచ్చన్ లాంటి ఆఫీసర్ అయితేనే ముత్యం జగ్గయ్య మీద రైడ్ కి వెళ్లి, ఎదుర్కోగలుగుతాడని బచ్చన్ ని రంగంలోకి దింపుతారు. ముత్యం ఇంటికి ఐటీ రైడ్స్‌కు వెళ్తాడు బచ్చన్. ఈ క్రమంలోనే జగ్గయ్యను బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని బచ్చన్ పట్టుకుంటాడా? బచ్చన్‌ను ఎదుర్కొనేందుకు జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కీ పాత్ర ఏంటి? అసలు చివరకు ఏం జరిగింది? అన్నది కథ.
విశ్లేషణ:
హిందీ లో వచ్చిన ఒరిజనల్ లో అజేయ దేవగన్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. కేవలం సీరియస్ ఫైనాన్సియల్ క్రైమ్ ఫిల్మ్ గా ఉన్న ఒరిజినల్ ని కామెడీ, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలిచారు హరీష్. ప్రమోషన్స్ లో 'అజయ్ దేవగన్ కి రవి తేజ కి ఎంత తేడా ఉందో, రైడ్ కి మిస్టర్ బచ్చన్ కి అంత తేడా ఉంటుందని' హరీష్ తెలిపారు. ఆ మాట వాస్తవం. అజయ్ దేవగన్ పాత్ర హుందాగా, సైలెంట్ గా ఉంటుంది. మిస్టర్ బచ్చన్ లో రవి తేజ పాత్ర తన మ్యానరిజానికి తగ్గట్టు, హండ్రడ్ పర్శంట్ హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. రైడ్ లో మొదటి నుంచి ఇన్ కమ్ టాక్స్ రైడ్ చూపిస్తారు. కానీ బచ్చన్ లో మొదట ఎంటర్ టైన్ చేసి, హీరో ఎంత పవర్ ఫుల్ అండ్ నిజాయితీ ఉన్న ఆఫీసరో చూపించి, ముత్యం జగ్గయ్య లాంటి పలుకుబడి ఉన్న విలన్ ని ఎదుర్కోవటానికి వీలుగా హీరో పాత్ర డిజైన్ చేశారు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు లవ్ సీన్స్ , కామెడీ , పెళ్లి ఇలా అన్నిటిని టచ్ చేస్తూ ఇంటర్వెల్ టైమ్ కి అసలు కథ లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం రైడ్ తో సంబంధం ఉండదు.
నిజంగా మన దేశంలో జరిగిన ఒరిజనల్ కథ ఇదని , దీనిని రైడ్ గా హిందీలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఒరిజనల్ లో లేని లవ్ ట్రాక్ ని పెట్టి, ఆడియన్స్ కి మంచి కాలక్షేపం ఇచ్చాడు దర్శకుడు. పాత హిందీ క్లాసిక్స్‌తో ముడిపెట్టి హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్‌ను నడిపిన విధానం మెప్పిస్తుంది. వాళ్ల మధ్య నడిచే క్యాసెట్స్ ప్రేమ రాయబారాలు అన్నీ ప్రేక్షకులకి పాత రోజులు గుర్తు చేస్తాయి. ఈ క్రమంలో వచ్చిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మధ్యలో దొరబాబుగా సత్య చేసే కామెడీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు మెయిన్ కథలోకి వెళ్తూ ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్‌కు వెళ్లడంతో మొత్తం యాక్షన్ జోనర్ మొదలవుతుంది. ఇక్కడే హరీష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా, కామెడీ, లవ్ ట్రాక్ నడిపి ఒక్కసారిగా సీరియస్ , యాక్షన్ లోకి వెళ్ళటం ఆడియన్స్ కనక్ట్ కాలేరు. మెయిన్ కథాంశం రైడ్ అయినపుడు, దానికి తగ్గట్టు ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఏమి కనిపించవు. సెకండ్ హాఫ్ మొత్తం రైడ్ మీదే అయినప్పుడు ఆసక్తికరంగా అనిపించేలా రైడ్ సాగే తీరులో కొంతైనా సీరియస్ నెస్ ఉంటే బాగుండేది. జగ్గయ్య బ్లాక్ మనీని బయట పెట్టే క్రమంలో హీరో తెలివిగా వ్యహరించిన సీన్స్ ఒక్కటి కూడా పడలేదు. జగ్గయ్య పరిచయం కరుడుగట్టిన విలన్‌లా చూపించినప్పటికీ తరవాత ఆ పాత్రలో అంత పవర్ చూపించలేదు. దీనితో కథలో ఆసక్తి తగ్గిపోతుంది. సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ అప్పీరియన్స్ అలరించింది. సిద్దు ఎంట్రీతో యాక్షన్ సీక్వెన్స్ కథలో జోరు పెరిగినా క్లైమాక్స్ సాదా సీదాగా ముగుస్తుంది.
నటీ నటులు:
బచ్చన్ పాత్రలో రవితేజ ఎప్పటిలా హుషారుగా నటించి ఆకట్టుకున్నాడు. తన దైన స్టైల్ లో డైలాగ్స్ తో, కామెడీ టైమింగ్ తో అలరించాడు. రవి తేజ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. వింటేజ్ రవితేజని గుర్తు తెచ్చేలా ఉంది ఆయన లుక్. ఫైట్స్, డ్యాన్సుల్లో రవి తేజ మార్క్ కనిపించింది. ఫిట్నెస్ పరంగా ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా ఉన్నాడు. హీరోయిన్ ని కేవలం పాటలు కోసం , గ్లామర్ కోసం వాడుకున్నారు. భాగ్యశ్రీ గ్లామర్ ఫస్ట్ హాఫ్ కి కలిసి వస్తుంది. ఈ మూవీ తరవాత భాగ్య శ్రీ కి మరిన్ని ఆఫర్లు రావటం పక్కా. తన డబ్బింగ్ తానే చెప్పుకుంది భాగ్యశ్రీ. జగపతి బాబు పాత్ర మొదట్లో చాలా పవర్ ఫుల్ గా అనిపించినా, తరవాత తేలిపోయింది. అరవింద్ సమెత వీర రాఘవ రెడ్డి సినిమాలో జగ్గు పాత్ర గుర్తుకు వస్తుంది కానీ ఆ మూవీలో ఉన్న విలనిజం బచ్చన్ లో మిస్ అయింది. విలన్ పాత్రని ఇంకొంచెం వాడుకుంటే బాగుండేది. సత్య కామెడీ టైమింగ్ బాగుంది. తనికెళ్ల భరణి, సచిన్ ఖేడ్కర్, గౌతమీ, అన్నపూర్ణమ్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు. సిద్ధు జొన్నలగడ్డ తెరపై కనిపించింది కొద్దిసేపైనా ఆ ఎపిసోడ్ అలరిస్తుంది. ఓ పాటలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తళుక్కున మెరిశారు.
టెక్నికల్ :
గబ్బర్ సింగ్‌లో హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ బచ్చన్ లో కనిపించదు. ఇది అవుట్ డేటెడ్ రీమేక్, స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. హరీష్ ఈ కథలో చేసిన కొన్ని మార్పులు, ఆయన రాసుకున్న సంభాషణలు కొన్ని వర్కవుటయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో బలమైన కథ లేకపోయినా లవ్‌ట్రాక్, కామెడీ సీన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించిన హరీష్, సెకండ్ హాఫ్ లో ఆసక్తికలిగించలేక పోయాడు. హరీష్ మార్క్ డైలాగ్స్ రెండు మూడు పేలాయి. పాత హిందీ పాటల ప్లేస్ లో తెలుగు ఓల్డ్ సాంగ్స్ వాడితే బాగుండేది. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన హిందీ పాటలు నేటి ప్రేక్షకులకి ఎంతవరకు కనక్ట్ అవుతాయి. మిక్కీ జే మేయర్ సంగీతం పాటల్లో హాయిగా ఉన్న, యాక్షన్ సీన్స్ లో హోరెత్తిపోతుంది. పాటలు అలరిస్తాయి. పాటలు వినటానికి, చూడటానికి ఇంపుగా ఉన్నాయి. అయానంక బోస్ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రవి తేజ
భాగ్య శ్రీ గ్లామర్
పాటలు
మైనస్ పాయింట్స్
కథ లేకపోవటం
సెకండ్ హాఫ్
అవసరానికి మించి యాక్షన్ సీన్స్
ఫైనల్ వర్దిక్ట్: మ్యాజిక్ లేని మిస్టర్
ALSO READ: IN ENGLISH