చిత్రం: మట్కా
దర్శకత్వం: కరుణ కుమార్
కథ - రచన: కరుణ కుమార్
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోని , అజయ్ గోష్, మైమ్ గోపి, తదితరులు
నిర్మాతలు: విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
సంగీతం: జి. వి . ప్రకాష్
సినిమాటోగ్రఫీ : ఎ. కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఆర్
బ్యానర్: వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, SRT ఎంటర్‌టైన్‍మెంట్స్
విడుదల తేదీ: 14 నవంబర్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు వరుణ్ తేజ్. కెరియర్ మొదటి నుంచి విభిన్న కథల్ని ఎంచుకుంటూ, ప్రయోగాలు చేస్తూ తన సినీప్రయాణం కొనసాగిస్తున్నాడు. వరుణ్ కెరియర్ లో ముకుంద, కంచె, ఫిదా లాంటి మంచి సక్సెస్ లున్నాయి. వరుణ్ మూస ధోరణిలో వెళ్లకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. గద్దలకొండ గణేష్ తరువాత వరుణ్ చేస్తున్న మాస్ గెటప్ మూవీ ఇదే కావటం విశేషం. ఈ మధ్య వరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఏవి అనుకున్న విజయాన్ని సాధించటం లేదు. దీనితో మట్కా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేసాడు ఈ సినిమాకోసం. ఇంతకీ మట్కా వరుణ్ కి హిట్ తెచ్చిందో లేదో? మట్కా వాసుగా వరుణ్ ప్రేక్షకులని రీచ్ అయ్యాడో లేదో చూద్దాం.
కథ :
ఈ కథ పీరియాడిక్ జోనర్. 1958 నుంచి 1982 మధ్య జరిగిన ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీ. బర్మా నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వస్తాడు వాసు (వరుణ్ తేజ్). శరణార్థి శిబిరంలో ('సత్యం' రాజేష్) పరిచయం అవుతాడు. అనుకోకుండా జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలోనే వాసు జైలుకు వెళతాడు. బయటకు వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్టులో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర కూలీగా పనిలో చేరుతాడు. కొబ్బరికాయల కొట్టులో పని చేసే ఒక సాధారణ కూలి అయిన వాసు మట్కా కింగ్ ఎలా అయ్యాడు? సుజాత (మీనాక్షి చౌదరి) ఎవరు? ఆమె తో ఎలా ప్రేమలో పడతాడు? వాసు మట్కా వాసుగా మారే క్రమంలో ఎదురైనా పరిణామాలు? వాటిని ఎదుర్కొనే తీరు? ఎంపీ నాని బాబు (కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) పాత్రలు వాసు జీవితంలో ఎలా తారసపడ్డాయి? సీబీఐ వాసు మీద ఎందుకు ఫోకస్ పెట్టింది. సాహు (నవీన్ చంద్ర) పాత్ర ఏంటి? వాసు, మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
'మట్కా' పేరు వినగానే చాలా మందికి రతన్ కత్రీ పేరు గుర్తుకు వస్తుంది. ఇతను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చి మట్కా కింగ్‌గా ఎదిగాడు. మట్కాని లీగల్ చేస్తే, ఇండియాకి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు ఈ గ్యాంగ్ స్టర్ రతన్ కత్రీ. ఇదే కథని 'మట్కా' సినిమాగా తీశారు దర్శకుడు కరుణ కుమార్. మన తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి విశాఖ బ్యాక్ డ్రాప్‌లో మట్కా మూవీ తెరకెక్కించారు. ఈ మూవీలో మట్కా గేమ్ ఒక్కటే కొత్తది. మిగతా అంతా రొటీన్ కథ. హీరో పాత్ర కూడా కామన్ గా ఉంటుంది. పైసా లేని పొజిషన్ నుంచి హీరో కోట్ల కి అధిపతి కావటం. అక్కడి నుంచి కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం, తనకు అడ్డొచ్చిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని చంపేయటం. ఇదంతా రొటీన్. అసలు ఇంటర్వెల్ వరకు మట్కా గేమ్ స్టార్ట్ అవదు. సెకండాఫ్ కూడా ఎంత మాత్రం ఆసక్తిగా లేదు.
టీజర్, ట్రైలర్, వరుణ్ గెటప్ చూసి అంతా ఇదేదో భారీ యాక్షన్ మూవీ అనుకుని ధియేటర్ కి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. యాక్షన్స్ సీక్వెన్స్ లేవు, ఎమోషన్స్ కూడా మట్కా లో కొరవడ్డాయి. రెండిటిలో ఏది బ్యాలన్స్ చేయాలో తెలియక రెండిటిని వదిలేసాడు దర్శకుడు. అసలు ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉండాల్సిన సినిమా మట్కా. హీరో పాత్ర కూడా కొత్తగా డిజైన్ చేయొచ్చు. ఈ తరహా సినిమాలు కొంచెం శ్రద్ద పెడితే బ్లాక్ బస్టర్ అవుతాయి. కానీ ఈ విషయంలో దర్శకుడు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. కూతురుకి వాసు మేక - నక్క కథ చెప్తాడు. కథలో ఉన్న ఎమోషన్ కూడా సినిమాలో లేదు. కాకపోతే యాక్షన్ తరహాలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ కథ చెప్తాడనుకుంటే ఎమోషనల్ కథ చెప్పటం కొంచెం నిరాశ కలిగిస్తుంది. అలాగే కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఒక పాట వస్తుంది. ఈ పాట ఈ సందర్భంలో అవసరమా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ రొటీన్ గా ఉంటుంది. మట్కా ఆట కొత్త. కానీ ఈ కథ కొత్త కాదు. వరుణ్ తేజ్ ఇలాంటి పాత్ర చేయటం ఇదే ఏమొదటిసారి కావొచ్చు. కానీ ప్రేక్షకులకు ఇది చాల రొటీన్.
నటీ నటులు:
కథ, హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా లేకపోయినా వాసు పాత్రకి జీవం పోసాడు వరుణ్ తేజ్. నటుడిగా వాసు పాత్రకి హండ్రెడ్ పర్శంట్ న్యాయం చేసాడు వరుణ్ తేజ్. వివిధ దశల్లో వాసు పాత్ర వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి. వరుణ్ నటనలో ఇంటెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ కూడా కమాండింగ్ గా ఉంది. నటుడిగా వరుణ్ తేజ్‌ని మరో మెట్టు ఎక్కించిన సినిమా 'మట్కా' . ఫస్ట్ సినిమా నుంచి సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్, గద్దలకొండ గణేష్ లో విలనిజంతో మెప్పించాడు. ఇప్పుడు మట్కా వాసు క్యారెక్టర్‌లో పూర్తి వేరియేషన్స్ చూపించాడు. వరుణ్ లుక్స్, హెయిర్ స్టైల్, వాకింగ్ ఇలా అన్నిటిలో తీసుకున్న కేర్ తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్, మట్కా. సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ చేశారు. రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో హిట్ కొట్టిన మీనాక్షికి ఈ సినిమా కూడా మంచి గుర్తింపు తెస్తుంది. సోపియాగా చేసిన నోరా ఫతేహి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం అయ్యింది. చాలా రోజుల తరువాత హీరోయిన్ సలోని పద్మ గా డిఫరెంట్ రోల్ చేసారు. కిశోర్, జాన్ విజయ్, 'సత్యం' రాజేశ్, నవీన్ చంద్ర తదితరులు తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
దర్శకుడు కరుణ కుమార్ 'మట్కా' పై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచారు కానీ కథలో మ్యాటర్ లేదు. కాకపోతే టేకింగ్ కొత్తగా ఉంది. రాసుకున్న కథని తెర మీద గ్యాంగ్ స్టర్ మూవీలా ప్రజంట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. తన ముందు సినిమాలకి భిన్నంగా మాస్ ఎలిమెంట్స్‌తో 'మట్కా' తెరకెక్కించాడు. మంచి కమర్షియల్ సినిమా తీసే సత్తా ఉందని నిరూపించుకున్నాడు కరుణ కుమార్. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ ఈ మూవీకి బలాన్నిచ్చింది. లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలకి సంగీతం అందించి ఒకే రోజు రెండు హిట్లు కొట్టిన జీవీ ప్రకాష్ మట్కా కి కూడా ప్లస్ అయ్యాడు. కాకపోతే పాటలు ప్లేస్ మెంట్, టైం బాలేదు. తన సంగీతంతో మట్కాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు సినిమాని. ఎడిటింగ్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ టీమ్ కష్టం అన్ని సినిమాలో కనిపిస్తున్నాయి. 1960 ల కాలం నాటి దృశ్యాలను అద్భుతంగా చిత్రించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్
జీవీ ప్రకాష్
ఆర్ట్ అండ్ డిజైన్
మైనస్ పాయింట్స్
కథ , కథనం
లెన్త్
ఫైనల్ వర్దిక్ట్ : కమర్షియల్ హంగులతో తీసిన రొటీన్ కథ 'మట్కా'