ENGLISH

బాలీవుడ్‌లో రష్మిక హల్‌చల్‌.. అప్పుడేనా.?

30 December 2020-09:33 AM

కన్నడ బ్యూటీ రష్మిక మండన్న, తెలుగునాట స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. తనదైన యాటిట్యూడ్‌తో, తనదైన గ్లామర్‌తో, తనదైన నటనతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న రష్మికకి, దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ అనూహ్యంగా పెరిగిపోతోంది. కన్నడ నాట ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్‌ వుంది. తమిళంలోనూ బీభత్సమైన ఫాలోయింగ్‌ కన్పిస్తోంది. తెలుగులో సంగతి సరే సరి. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రష్మిక తనదైన ముద్ర వేస్తోంది. కరీనా కపూర్‌, కత్రినాకైఫ్‌, దీపికా పడుకొనే.. లాంటి మేటి బాలీవుడ్‌ బ్యూటీస్‌ కంటే ఎక్కువగా రష్మిక గురించి చర్చించుకుంటున్నారట బాలీవుడ్‌లో.

 

ఇటీవలే రష్మిక తొలి బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. ఇంతలోనే ఇంకో సినిమాకి రష్మిక సైన్‌ చేసిందట. మరోపక్క, బాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు, రష్మిక మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట. కానీ, రష్మిక మాత్రం సౌత్‌ సినిమాల్ని బ్యాలెన్స్‌ చేసుకుని, బాలీవుడ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి కాబట్టి, ఆచి తూచి వ్యవహరిస్తోందట డేట్స్‌ ఇచ్చే విషయమై. 'కన్నడ సినిమా అయినా, తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా.. పెద్దగా తేడాలుండవ్‌.. లాంగ్వేజ్‌ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

 

అలాగని, సౌత్‌ సినిమాల్ని పక్కన పెట్టి బాలీవుడ్‌కి ఎక్కువ ప్రాధాన్యమివ్వలేను..' అంటూ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో రష్మిక చెప్పింది. అయితే, ఒక్కసారి బాలీవుడ్‌లో సక్సెస్‌ రుచి చూశాక, సౌత్‌ని మర్చిపోయిన హీరోయిన్లు చాలామందే వున్నారు. మరి, రష్మిక కూడా అదే పనిచేస్తుందా.? ఏమో మరి, కొంతకాలం వేచి చూడాల్సిందే.

ALSO READ: సినీ పరిశ్రమకి కరోనా భయం ఇంకెన్నాళ్ళు.?