రాజమౌళి స్ట్రాటజీలన్నీ ఓ మెట్టు పైనే ఉంటాయి. తన సినిమాకి ఏం కావాలో? ఏం చేస్తే తన సినిమాకి ప్లస్ అవుతుందో? ఏ అడుగేస్తే.. సినిమాకి మార్కెట్ పెరుగుతుందో బాగా తెలుసు. ఓ పోస్టర్ వదలాలన్నా.... వంద రకాలుగా ఆలోచిస్తుంటాడు. ఆర్.ఆర్.ఆర్ గురించి తను తీసుకున్న అన్ని నిర్ణయాలూ ప్లస్సే అయ్యాయి. అయితే... ఒక్క ట్రైలర్ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఈరోజు సాయింత్రం 4 గంటలకు యూ ట్యూబ్ లోనూ, సోషల్ మీడియాలోనూ విడుదల అవుతోంది. ఈ ట్రైలర్ కోసం... దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే.. ఉదయం 10 గంటలకు అభిమానుల కోసం కొన్ని ప్రత్యేకమైన థియేటర్లలో ఈ ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు. బాహుబలి ట్రైలర్ కూడా ఇలానే థియేటర్లలో విడుదల చేశాడు రాజమౌళి. అప్పుడు థియేటర్ల దగ్గర పండగ లాంటి వాతావరణం నెలకొంది. నిజంగానే సినిమానే విడుదల అవుతోందేమో అనిపించేంత సంబరం కనిపించింది.
అయితే ఈసారి మాత్రం థియేటర్లలో 10 గంటలకు,యూ ట్యూబ్‌లో 4 గంటలకు అనేసరికి.. చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఈలోగా.. సెల్ ఫోన్లలో రికార్డు చేసి, దాన్ని సోషల్ మీడియాలో షేరు చేసేవాళ్లు ఎక్కువైపోతారు. ట్రైలర్ అఫీషియల్ గా బయటకు రాకుండానే... ఇలా తక్కువ క్వాలిటీ గల సెల్ ఫోన్ల నుంచి బయటకు వచ్చిన వీడియోలలో వీక్షించడం ద్వారా... ఆ ఇంపాక్ట్ మొత్తం పోతుంది. పైగా.. యూ ట్యూబ్ కోసం ఎదురు చూసి, అందులోనే చూసే బ్యాచ్ తగ్గిపోతుంది. దాంతో.. యూ ట్యూబ్ రికార్డులకు గండి పడుతుంది. అటు థియేటర్లలో, ఇటు యూ ట్యూబ్‌లో ఒకేసారి విడుదల చేసుంటే బాగుండేది. అన్ని విషయాల్లోనూ బాగా ఆలోచించే రాజమౌళి... ట్రైలర్ విషయంలోనే తెలివి తక్కువగా ఆలోచించాడంటూ.. టాలీవుడ్ లో.. గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న మతలబు ఏమిటో?