ఏ సినిమాకైనా ప్రచారం చాలా అవసరం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చిత్రసీమ పెట్టుకునే అతి పెద్ద నియమం. కానీ.. పుష్ప విషయంలో ఇది రివర్స్ అవుతోందనిపిస్తోంది. ఈనెల 17న విడుదల కాబోతున్న భారీ సినిమా.. పుష్ప. ఈ సినిమాపై చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి. అయితే... పబ్లిసిటీ విషయంలో మాత్రం పుష్ప తేలిపోతోంది. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. జనవరి 7న విడుదల అవుతున్న ఆర్.ఆర్.ఆర్‌నే ఈ రేంజులో ప్రమోషన్లు చేస్తుంటే.. డిసెంబరు1 7న రాబోతున్న పుష్ప ఇంకెంత చేయాలి? కానీ ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు.
హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పుష్ప విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. కాకపోతే... ప్రమోషన్లు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో లేవు. ఇప్పటి వరకూ వేరే భాషల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం గానీ, ఓ ఈవెంట్ చేయడం గానీ జరగలేదు. మరి ఇదంతా అతి విశ్వాసమో.. లేదంటే.. తెలుగులో మాత్రం ఈ సినిమా చూస్తే చాలన్న అభిప్రాయమో తెలియడం లేదు. డిసెంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి చిత్రబృందం అంతా అహర్నిశలూ కష్టపడుతుతోంది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేకపోయారు. సినిమా మేకింగ్ లో ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రమోషన్లకు ప్లాన్ చేసుకునే తీరిక ఎక్కడిది..?
ఆర్.ఆర్.ఆర్ అలా కాదు. ఆ సినిమా పూర్తయిపోయింది. సినిమా రిలీజ్‌కి చాలా సమయం ఉంది. అందుకే ప్రశాంతంగా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. అందుకే... ఆర్.ఆర్.ఆర్‌తో పోలిస్తే.. పుష్ప ప్రమోషన్ల విషయంలో వెలవెలబోతోంది.
ALSO READ: పుష్పలో.. వీరప్పన్?