ENGLISH

సమంత స్పీడుగా 'యూటర్న్‌' తీసుకుంటోంది

19 June 2018-18:05 PM

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా నటించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ఘనత సమంతకే దక్కింది. 'రామలక్ష్మి' పాత్ర సమంత కెరీర్‌ టర్నింగ్‌ క్యారెక్టర్‌ అని చెప్పాలి. అంతేకాదు, 'మహానటి'లో సమంత పోషించిన 'మధురవాణి' పాత్ర కూడా అలాంటిదే. పెళ్లి తర్వాత సమంత కెరీర్‌కి అస్సలు ఢోకా లేదు. ఫుల్‌ స్పీడుగా దూసుకెళ్ళిపోతుంది. పర్‌ఫామెన్స్‌ రోల్స్‌నే ఎక్కువగా ఎంచుకుంటోంది. 

వరుసగా 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలతో హిట్‌ కొట్టడమే కాకుండా, అనువాద చిత్రం 'అభిమన్యుడు'తోనూ బంపర్‌ హిట్‌ అందుకుంది. ఇక తాజాగా సమంత నుండి రాబోతున్న చిత్రం 'యూ టర్న్‌'. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అదే టైటిల్‌తో తెలుగులోకి రీమేక్‌ అవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమంతతో పాటు, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతోనూ సమంత మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో కూడా సమంత జర్నలిస్టు పాత్రనే పోషిస్తోంది. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో ఇంతవరకూ సమంత కనిపించని లుక్‌లో కనిపించనుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. 

మెయిన్‌ థీమ్‌ మాత్రమే తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పలు మార్పులు చేర్పులు చేయనున్నారట. సమంత పర్‌ఫామెన్సే ఈ సినిమాకి హైలైట్‌ అని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

ALSO READ: బిగ్ బాస్ హోస్ట్ నాని పై సంజన సంచలన వ్యాఖ్యలు..!