ENGLISH

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి అన్యాయం జరుగుతోందా?

09 May 2024-16:58 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. చిన్న హీరో దగ్గరనుంచి పెద్ద హీరో వరకు ఎదో ఒక అకేషన్ సంద‌ర్భంగా వారి కెరియర్ లో ది బెస్ట్ అనుకున్న సినిమా రీ రిలీజ్ చేసి, ఫాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నిర్మాతలు రెండో సారి కూడా  డబ్బులు దండుకుంటున్నారు.  ఈ క్రమంలో అప్పుడు డిజాస్టర్ లుగా నిలిచినవి ఇప్పుడు జనాదరణకి నోచుకుంటున్నాయి. ఇంకొన్ని పోటీ పడి మరీ వసూళ్లు సాధిస్తున్నాయి. సినిమా విడుద‌లై, 10 ఏళ్ళు అయిన సంద‌ర్భంగా, 15  ఏళ్ళు, 20  ఏళ్ళు అని రక రకాల వేడుకలు చేస్తున్నారు. ఈ వేడుకల్లో దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, హీరో, మిగతా పాత్రధారులూ, సాంకేతిక నిపుణులూ పాల్గొంటున్నారు. అప్పటి విషయాలను గుర్తు చేసుకుని ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా ఓకే కానీ ఇందులో హీరోయిన్ కి చోటు కల్పించకపోవడం కొంచెం బాధాకరమే.


సినిమా ఇండస్ట్రీ లో మేల్ డామినేషన్ ఎక్కువ అని, ముఖ్యంగా సౌత్ లో  హీరోయిన్స్ కి అంతగా ప్రాముఖ్యత ఇవ్వరని పలు మార్లు కొందరు కథా నాయికలు వాపోయారు. ఇప్పడు అదే విషయాన్ని రుజువు చేస్తూ టాలీవుడ్ లో సక్సెస్ మీట్ లు, రీ రిలీజ్ లు కొనసాగుతున్నాయి. ఆఖరికి ప్రెస్ మీట్స్ లో కూడా హీరోయిన్స్ ని ఎవరూ ప్రశ్నించటం లేదని కొందరు బాధపడుతున్నారు. ఇటీవల 'గామి' ప్రెస్ మీట్ లో చాందిని చౌదరి విలేఖరుల్ని ఇదే ప్రశ్న అడిగారు. పేరుకి మాలాంటి హీరోయిన్స్ ని కూర్చో బెడతారు కానీ, మేము ఎంత కష్టపడ్డామో, మా వెర్షన్ ఏంటి అని ఎవ్వరూ గుర్తించరు, ప్రశ్నించరు అని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు టాలీవుడ్ తీరు తెన్నులు చూస్తుంటే హీరోయిన్స్ ఆక్రోశం నిజమే అనిపిస్తోంది.   


అనుష్క, సమంత,  త్రిష, నయన తార లాంటి స్టార్ హీరోయిన్స్ సినిమాలు వాళ్ళ పుట్టిన రోజు న రీ రిలీజ్ అయిన సందర్భాలు లేవు, ఎందుకు వారికి ఫాన్స్ లేరా? అసలు హీరోయిన్ లేకపోతే ఇండియన్ సినిమా లేదు. సినిమాలో  హీరో తరవాత  హీరోయిన్ కే ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది సినిమా సక్సెస్ మీట్ లలో, రీ రిలీజ్ లలో వాళ్లు ఎందుకు కనిపించటం లేదు. రీసెంట్ గా ఆర్య మూవీ 20  ఏళ్ళ వేడుక జరిగింది. ఈ వేడుకలో బన్నీ, సుకుమార్ , దిల్ రాజ్, దేవి శ్రీ  కనిపించారు. కానీ హీరోయిన్ అను మెహతా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆమె  ప్రస్తావన కూడా లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్  సౌత్ లో కోకొల్లలు కనిపిస్తున్నాయి. ఈ భేష‌జాలాలు త‌గ్గాల‌ని హీరోయిన్స్ కోరుకొంటున్నారు.