ENGLISH

సుప్రీత వివరణ.. బెట్టింగ్ యాప్ ప్రచారంపై క్షమాపణలు

16 March 2025-15:24 PM

సినీ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత, సోషల్ మీడియా ద్వారా తనదైన గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కలిసి ఓ సినిమాలో నటిస్తూనే, ‘పీలింగ్స్ విత్ సుప్రీత’ అనే టాక్ షో నిర్వహిస్తోంది. తన స్టైల్, మాటతీరు, వ్యక్తిగత అభిప్రాయాలతో నెటిజన్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత, తాజాగా చేసిన ఒక ప్రకటనతో మరింత చర్చనీయాంశంగా మారింది. హోలీ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, అనుకోకుండా చేసిన తప్పుకు క్షమాపణలు కూడా కోరింది.

ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలువురిపై కేసులు నమోదవ్వగా, మరికొందరు వివరణలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీత స్పందిస్తూ, తాను కూడా తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన విషయాన్ని అంగీకరించింది. సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏదో ఒక యాడ్‌ను ప్రమోట్ చేసినంత మాత్రాన అది పెద్ద సమస్య అవుతుందని అర్థం కాలేదని, అయితే ఇప్పుడు ఆ ప్రభావాన్ని గుర్తించి తాను మళ్లీ అలాంటి ప్రమోషన్లు చేయబోనని స్పష్టం చేసింది.

‘‘నేను అనుకోకుండా చేసిన తప్పు వల్ల ఎవరైనా ప్రేరేపితులై ఇలాంటి యాప్‌ల వలన నష్టపోయి ఉంటే, వారి నుంచి మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఇక మీదట అలాంటి ప్రమోషన్లకు దూరంగా ఉంటాను. మీరు కూడా బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి. ఇలాంటి యాప్‌లను ఎవరూ ప్రోత్సహించకండి’’ అని సుప్రీత విజ్ఞప్తి చేసింది.

సుప్రీత కేవలం క్షమాపణలు చెప్పడమే కాకుండా, బెట్టింగ్ యాప్‌ల గురించి స్పష్టమైన హెచ్చరికలు కూడా చేసింది. ‘‘ఈ యాప్‌లు మొదట్లో ఆకర్షణీయంగా కనిపించి, చిన్న మొత్తాలతో ఆడేలా ప్రేరేపిస్తాయి. కానీ, చివరకు అది మన జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరుకుంటుంది. అందుకే వీటి ప్రభావాన్ని అర్థం చేసుకుని, వెంటనే బెట్టింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. వాటిని సోషల్ మీడియాలో ఫాలో కావద్దు’’ అంటూ నెటిజన్లకు సూచించింది.

ALSO READ: సమంత నిర్మాతగా.. తొలి సినిమా విడుదలకు సిద్ధం