ENGLISH

మెగా కాంపౌండ్‌ని ఇక వదలడా?

14 June 2018-18:02 PM

మెగా కాంపౌండ్‌కి ఆస్థాన డైరెక్టర్‌గా ఉండిపోయాడు సురేందర్‌ రెడ్డి. గత కొంతకాలంగా సురేందర్‌ రెడ్డి మెగా కాంపౌండ్‌ హీరోలకే ఫిక్స్‌ అయిపోయాడు. సురేందర్‌రెడ్డికి ఫస్ట్‌ మెగా కాంపౌండ్‌ హీరో అల్లు అర్జున్‌. 'రేసుగుర్రం' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు. తర్వాత చరణ్‌తో 'ధృవ'. ధృవ సంగతి కూడా చెప్పనే అక్కర్లేదు. గడ్డు పరిస్థితిలో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు కొల్లగొట్టింది. ఈ కాంపౌండ్‌లో ముచ్చటగా మూడో సినిమాగా ఏకంగా మెగాస్టార్‌ 151వ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని కొట్టేశాడీ స్టైలిష్‌ డాక్టర్‌. 

ఇంతటితో సురేందర్‌ రెడ్డి ఆగేలా లేడండోయ్‌. చరణ్‌తో మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు. చరణ్‌తో 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాని రీమేక్‌ చేసే యోచనలో సురేందర్‌ రెడ్డి ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లే యోచన కూడా చేస్తున్నాడట సురేందర్‌ రెడ్డి. ఇంతే కాదు, 'రేసుగుర్రం' సినిమాతో హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌ కూడా సురేందర్‌ రెడ్డికి మరో ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటున్నాడట. ఇలా సురేందర్‌ రెడ్డి డైరీ మెగా కాంపౌండ్‌ హీరోల సినిమాలతో ఇప్పట్లో ఖాళీ లేదనే చెప్పాలి. 

ఇకపోతే ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రస్తుతం హైద్రాబాద్‌ శివార్లలో చిత్రీకరిస్తున్నారు. తెలుగుతో పాటు, ఇతర భాషల ప్రముఖ నటీనటులంతా ఈ సినిమాలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
 

ALSO READ: నా నువ్వే రివ్యూ & రేటింగ్