ENGLISH

డ్రగ్స్‌ రచ్చ: ఎవరికి ఎప్పుడు మూడుతుందో చెప్పలేం

16 September 2020-18:00 PM

సినీ రంగంపై ‘డ్రగ్స్‌ ఆరోపణలు’ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ‘కొందరు చేసిన తప్పుకి మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదు..’ అని సినీ ప్రముఖులు కొందరు గగ్గోలు పెడుతున్నా, జరగాల్సిన డ్యామేజీ ఇప్పటికే జరిగిపోయింది. బాలీవుడ్‌ నుంచి శాండల్‌వుడ్‌ వరకూ డ్రగ్స్‌ ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అరెస్టులూ జరిగాయి. రేపో మాపో రకుల్‌ని అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరగ్గా, అందులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకొస్తుండడం గమనార్హం.

 

రకుల్‌ పేరు లిస్ట్‌లో లేదన్నారు, ఆ తర్వాత వుందని అంటున్నారు విచారణ అధికారులు. ఇదిలా వుంటే, డ్రగ్స్‌తో లింకులున్నాయంటూ కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లనూ కొన్ని మీడియా సంస్థలు తెరపైకి తెస్తున్న దరిమిలా, ఆయా కోణాల్లోనూ విచారణ జరిగే అవకాశం వుందట. ‘రకుల్‌ పేరు లేకుండానే ఆమె పేరుని ప్రచారంలోకి తెచ్చారు..’ అంటూ కొందరు సెలబ్రిటీలు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అంతలోనే రకుల్‌ పేరుని ఎన్సీబీ అధికారులు ప్రస్తావించడం గమనార్హం.

 

ఇప్పటికే అరెస్టయిన రియా చక్రవర్తి, రకుల్‌ పేరుని చెప్పిందట. సంజన కూడా కొందరు ప్రముఖుల పేర్లు చెప్పిందనీ, అందులో ఒకరిద్దరు టాలీవుడ్‌ ప్రముఖులతోపాటు, ఓ కోలీవుడ్‌ ప్రముఖుడూ వున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ సినీ ప్రముఖుడి పేరు ఎన్సీబీ నోట బయటకు వస్తుందో తెలియక ఆయా సినీ పరిశ్రమల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.

ALSO READ: సంక్రాంతి పుంజులు రెడీ అవుతున్నాయి.