ENGLISH

టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌ని ఫాలో అయ్యేదెవరు?

13 March 2018-09:30 AM

పవన్‌ కళ్యాణ్‌ అమరావతిలో ఇళ్లు కడుతున్నారు. తాజాగా భూమి పూజ చేయించారు. అంటే పవన్‌ కళ్యాణ్‌ హైద్రాబాద్‌ వదిలి అమరావతికి తరలిపోతున్నారా? అంటే పూర్తిగా చెప్పలేము. కానీ పవన్‌ ఆంధ్రాలో కూడా ఓ ఇల్లు అమర్చుకుంటున్నారని అయితే స్పష్టమైంది. అమరావతికి ఇది మేజర్‌ డెవలప్‌మెంట్‌ అని చెప్పుకోవాలి. 

సినీ నటి రోజా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా హైద్రాబాద్‌లోనే ఎక్కువ ఉంటారు. సొంతూరు నగరిలో ఇల్లున్నా పూర్తిగా హైద్రాబాద్‌లోనే ఉంటారు ఎమ్మెల్యే రోజా. అలాగే మరో ఎమ్మెల్యే మురళీ మోహన్‌ కూడా అంతే. సొంత నియోజకవర్గంలో ఉన్నది లేదు. బాలయ్య కూడా అంతే. అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుకి కూడా అమరావతిలో సొంతిళ్లు లేదు. పార్టీ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. జగన్‌కి కూడా అమరావతిలో ఇళ్లు లేదు. 

ఇటీవలే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు విజయవాడలో. అదీ టెంపరర్లీగానే. ఇలా చెప్పుకుంటూ పోతే మన రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. పాలన అక్కడి నుండి, సొంత నివాసాలు మాత్రం ఇక్కడే. కానీ ఇటు రాజకీయాల పరంగానైనా, అటు సినిమాల పరంగానైనా పవన్‌ కళ్యాణ్‌ వేసిన ఈ ముందడుగు ఆహ్వానించదగ్గది. మెచ్చుకోదగ్గది. సినిమా పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్లాలనే ఆలోచనకు కూడా బీజం పడినట్లైయింది పవన్‌ వేసిన ఈ అడుగుతో అని చెప్పాలి. 

పవన్‌ కళ్యాణ్‌ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలంలోని కాజా సమీపంలో ఈ సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. మరి పవన్‌ ఇచ్చిన ఈ నూతన ఉత్సాహంతో, పవన్‌ వెనక ఎంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు అమరావతికి తరలి వెళ్లే ఆలోచన చేస్తారో చూడాలి మరి.

ALSO READ: అసభ్యమైన కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి