ENGLISH

మిథున్ చక్రవర్తి ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్

30 September 2024-15:27 PM

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి. 2022 ఏడాదికి గాను ఈ అవార్డుకి బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. అక్టోబ‌ర్ 8న జ‌రిగే 70వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల వేడుక‌ల్లో ఈ పుర‌స్కారాన్ని మిథున్ అందుకోనున్న‌ట్లు కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని స్పష్టం చేయటమే కాకుండా   'మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం గూర్చి మాట్లాడుతూ సినిమా రంగానికి మిథున్ చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనదని, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన జ్యూరీ ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనికి  అందించా లని నిర్ణయించిందని ట్వీట్ చేసారు.  


బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోల్లో మిథున్ చక్రవర్తి ఒకరు. బెంగాల్ కి చెందిన మిథున్ బాలీవుడ్ లో 1976లో 'మృగాయ' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అప్పటినుంచి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలురకాల పాత్రలు పోషించారు.  బన్సారి, ముక్తి, ప్రేమ్ వివాహ్, అమర్దీప్, కస్తూరి, కిస్మత్ ,మేరా సాతి, వాంటెడ్, దలాల్, భీష్మ, కిక్, సుల్తాన్, డిస్కో డాన్సర్ లాంటి సూపర్వం హిట్ సినిమాల్లో నటించారు. 


మొదట బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న మిథున్ తరవాత బెంగాలీ, తెలుగు, ఒరియా, కన్నడ, భోజ్ పురి సినిమాల్లో కూడా కనిపించారు. రీసెంట్ గా పద్మభూషణ్ అందుకున్న మిథున్ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ మరో అరుదైన అవార్డును అందుకోవటం విశేషం. మిథున్ సినిమా కెరియర్లో ఇప్పటికే మూడు నేషనల్ అవార్డ్స్, పద్మ  భూషణ్ ఉన్నాయి ఇప్పుడు దాదా సాహెబ్ అవార్డ్ కూడా చేరింది.