ENGLISH

జ‌గ‌న్‌తో టాలీవుడ్ మీటింగ్ పక్కా

05 June 2020-15:43 PM

చిత్ర‌సీమ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించీ, షూటింగులు, థియేట‌ర్ల అనుమ‌తుల గురించి తెలంగాణ ప్ర‌భుత్వంతోనూ. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోనూ తెలుగు చిత్ర‌సీమ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీలో ర‌క‌ర‌కాల విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. కొన్ని అంశాల్లో కేసీఆర్ కూడా పాజిటీవ్ గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్ సీ.ఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స‌య్యింది. ఈనెల 10న తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన ప్ర‌ముఖులు జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఈ మీటింగ్‌లో ప‌లు కీల‌క‌మైన విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 

తెలంగాణ మీటింగుల్లో పాలు పంచుకున్న‌వాళ్లే ఈసారీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారీ చిరంజీవి ఆధ్వ‌ర్యంలోనే మీటింగులు జ‌ర‌గ‌బోతున్నాయ‌ట‌. అయ‌తే బాల‌కృష్ణ‌ని పిలిచారా? పిలిస్తే ఆయ‌న వ‌స్తారా? అనే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది. ''నన్నెవ‌రూ మీటింగుల‌కు పిల‌వ‌లేదు..'' అంటూ బాల‌య్య బాహాటంగానే త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ మీటింగ్ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ALSO READ: సినిమాల‌కు దూరంగా స‌మంత‌