ENGLISH

జీబ్రా మూవీ రివ్యూ & రేటింగ్‌

22 November 2024-13:52 PM

చిత్రం: జీబ్రా 
దర్శకత్వం:  ఈశ్వర్ కార్తీక్
కథ - రచన:  ఈశ్వర్ కార్తీక్

నటీనటులు: సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనుంజయ్, సత్య రాజ్, అమృత అయ్యంగారు, సునీల్, సత్య, కళ్యాణి నటరాజన్, సురేష్ చంద్ర మీనన్, రామరాజు తదితరులు.

నిర్మాతలు: బాల సుందరం, ఎస్‌.ఎన్‌. రెడ్డి, ఎస్‌ పద్మజ, దినేష్‌ సుందరం

సంగీతం: రవి బ్రస్రూర్
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌
ఎడిటర్: అనిల్ క్రిష్

బ్యానర్: ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌

విడుదల తేదీ: 22 నవంబర్ 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 1.75/5

అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు మన పెద్దలు. సత్య దేవ్ పరిస్థితి కూడా అంతే. చూడటానికి బాగానే ఉంటాడు, నటన ఎంచటానికి లేదు. కథల ఎంపిక కూడా బాగానే ఉంటుంది. నేల విడిచి సాము చేయడు. అయినా క్లిక్ అవటం లేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి మెచ్చిన నటుడు సత్య దేవ్. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటే సత్య దేవ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. గాడ్ ఫాదర్ లో చిరుకి ధీటుగా నటించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. గాడ్ ఫాదర్  తరువాత సత్య దేవ్ నుంచి వస్తున్న సినిమా 'జీబ్రా'. ఈ మూవీ  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చిరు వచ్చి, సత్య దేవ్ ని ప్రశంసించటం ప్రమోట్ చేయటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన జీబ్రా మూవీ ఎలా ఉందో? సత్య దేవ్ కి అనుకున్న హిట్ వచ్చిందో  లేదో? జీబ్రా సత్య దేవ్ కెరియర్ కి ఎలా ఉపయోగపడిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్ షిప్ మ్యానేజర్ గా వర్క్ చేస్తుంటాడు సూర్య (సత్యదేవ్). అతని తల్లి, ప్రాణంగా ప్రేమించే స్వాతి (ప్రియ భవానీ శంకర్), తప్పించుకుందాం అన్నా  వదులుకోలేని ఫ్రెండ్ బాబ్ (సత్య)తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తాను ప్రేమించే స్వాతి కూడా వేరే బ్యాంక్ లో వర్క్ చేస్తుంది. స్వాతి ఓ రోజు తప్పుడు అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆ అకౌంట్ హోల్డెర్ ఆ మనీని వాడేసుకుంటాడు. ఈ విషయంలో స్వాతికి సాయం చేయాలనుకుంటాడు సూర్య. నాలుగు లక్షల బ్యాంక్ ఫ్రాడ్ ఇష్యూ నుంచి కాపాడే ప్రయత్నంలో అనుకోకుండా సూర్య 5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ లో చిక్కుకుంటాడు. దాని కారణంగా స్టేట్ లోనే పేరున్న, మోస్ట్ డేంజరస్ పర్సన్ ఆది (ధనంజయ్)కి ఎదురు వెళాల్సి వస్తుంది. సూర్య 5 కోట్ల రూపాయల సమస్యలో ఎలా ఇరుక్కున్నాడు? సూర్య లైఫ్ లోకి ఆది రావటానికి కారణం ఏంటి? ఎలా వచ్చాడు?  చివరికి ఈ సమస్యల నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు? అన్నది జీబ్రా కథ.

విశ్లేషణ: 

బ్యాంకుల మోసాలు చుట్టూ తిరిగే కథలు వస్తూనే ఉన్నాయి. ఇదేం కొత్త కథ కాదు. అజిత్ హీరోగా వచ్చిన 'తెగింపు', మహేష్ 'సర్కారు వారి పాట' రీసెంట్ గా వచ్చిన దుల్కర్ సల్మాన్‌ మూవీ 'లక్కీ భాస్కర్' ఇవన్నీ ఒక కోవకి చెందిన సినిమాలు కాగా . జీబ్రా మూవీ వీటికి విరుద్ధంగా ఉంది. కథ ఇంచు మించుగా ఒకేలా ఉన్నా, స్క్రీన్‌ ప్లేతో కొత్తదనం తీసుకువచ్చారు దర్శకుడు ఈశ్వర్ కార్తిక్. జీబ్రా కథలో మెయిన్ పాయింట్‌ బ్యాంకుల్లో ఉన్న లూప్ హొల్స్. దీనితో పాటు మనీ లాండరింగ్, గ్యాంగ్ స్టర్ అనే మరో రెండు పాయింట్ లని కూడా యాడ్ చేసారు దర్శకుడు. అదే సినిమాకి మైనస్ గా మారింది. ఇన్ని పాయింట్స్ ని ఒకే సినిమాలో క్షుణ్ణంగా చూపించే ఛాన్స్ ఉండాలి కదా. కథ మొదలు పెట్టిన విధానం  ఆసక్తిగా ఉన్నా, అదే ఆసక్తిని చివరి వరకు నడిపించలేకపోయాడు.  చెక్ రాంగ్ డిపాజిట్ చేసాక, లూప్ హొల్స్ ద్వారా ఆ మనీని వెనక్కి తీసుకురావటంతో, తరువాత కథ పై క్యురియాసిటీ పెంచాడు.కానీ ఆయా పాత్రలు ఎంటర్ అయ్యేసరికి కథలో పట్టు కోల్పోయి ఆసక్తి తగ్గిపోతుంది. కోట్లకు అధిపతి అయిన విలన్ 5 కోట్ల కోసం హీరో వెంట పడటం, దానికోసం నడిపించిన విలనిజం సిల్లీగా అనిపిస్తుంది.

ఈ సైబర్ క్రైమ్ జోనర్ లో ఇంకొంచెం డీటెయిలింగ్, ఎమోషన్ తోపాటు ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఇస్తే జనాలకి అర్థం అవుతుంది. మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. జీబ్రా ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది.  కొన్ని సీన్స్ కి లాజిక్స్ లేవు, సినిమాటిక్ గా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ టాపిక్ కూడా టచ్ చేసి వదిలేసినట్లు ఉంది. డిటైల్డ్ గా లేవు. అందుకే కథలో కనక్టివిటీ లేకుండా సాగింది. ఆడియన్స్ కథతో ట్రావెల్ చేయటానికి ఆసక్తి చూపరు. హీరో సమస్యను ఓన్ చేసుకోలేము.  లాజిక్కులు అడగని వారికి  జీబ్రా పరవాలేదనిపిస్తుంది. డాలీ యాక్టింగ్, క్యారెక్టరైజేషన్, సత్య కామెడీ, సత్యదేవ్ నటన మొతం కలిసి సినిమాని ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేస్తాయి. ఫస్టాఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా కథను మొదలెట్టిన దర్శకుడు సెకండాఫ్‌ ని రొటీన్ కమర్షియల్ మూవీగా మార్చేశాడు. సెకండాఫ్‌ బోర్ ఫీలింగ్ కలుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి 'జీబ్రా' నచ్చుతుంది.

నటీ నటులు:

సత్యదేవ్‌కి నటనకి వంకలు పెట్టడానికి లేదు. పర్ఫెక్ట్ నటన తో ఆకట్టుకుంటాడు. ఈ సినిమా మొత్తాన్ని తన బుజాలపై మోశాడు సత్య దేవ్.  సత్య దేవ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు, కానీ ఈ సారి తన నటనతో సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నిట్లో ది బెస్ట్ ఇచ్చాడు సత్య దేవ్. ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో కనిపించిన ప్రియ భవానీ శంకర్‌ ఈ సినిమాలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి, మెప్పించింది. ఈ సినిమా తరవాత ప్రియ భవానీ శంకర్ కి తెలుగులో ఛాన్స్ లు పెరిగే అవకాశముంది. మత్తు వదలరా తరవాత సత్య కామెడీకి ఫాన్స్ పెరిగారు. తన పై ఉన్న అంచనాల్ని వమ్ము చేయలేదు కమెడియన్ సత్య.  మరోసారి తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. సెకండాఫ్‌లో సత్య కామెడీ అదిరింది.  పుష్పలో జాలిరెడ్డి పాత్రలో నటించిన  డాలి ధనంజయ, జీబ్రాలో కీ రోల్ చేశాడు. కానీ ఈ పాత్రలో ఇంకెవరైనా అయితే విలనిజం పండి ఉండేది. నెగిటివ్ షేడ్స్‌ని సరిగ్గా మ్యానేజ్ చేయలేకపోయాడు ధనుంజయ్. సునీల్, సత్యరాజ్, అమృత అయ్యంగార్, సురేష్ మీనన్, జెన్నిఫర్ లు తమ పాత్రల పరిధి మేరకు  నటించారు.

టెక్నికల్:

దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మొదటి సినిమా 'పెంగ్విన్'. కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీనితో జీబ్రాకి చాలా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో పక్కాగా వ్యవహరించాడు. డాలీ-సత్యదేవ్ ఫస్ట్ మీట్ ను చూపించిన సీన్ హైలెట్. దర్శకుడు ఇదివరకు బ్యాంక్ ఎంప్లాయ్ కావడంతో బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ పై ద్రుష్టి పెట్టి ఉంటే సక్సెస్ అయ్యి ఉండేవాడు. జీబ్రా మూవీకి ప్రధాన బలం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలకి సంగీతం అందించిన రవి బస్రూర్ ఇలాంటి చిన్నహీరో సినిమాకి మ్యూజిక్ అందించటంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకి తగ్గట్టే ఉంది రవి బ్రసూర్ మ్యూజిక్. సినిమాలో కొన్ని సీన్స్‌ని రవి బ్రసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోరేంజ్ కి తీసుకు వెళ్ళింది. సాంగ్స్‌ ప్లేస్ మెంట్ బాలేదు. సత్య పోన్మార్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ కూడా  సినిమాకి ప్లస్ అయ్యింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా స్క్రీన్ పై  కనిపిస్తోంది. బ్యాంక్ సెట్ ని పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

సత్య దేవ్ 
సంగీతం
ఎడిటింగ్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్
బోరింగ్ సీన్స్
లాజిక్స్ లేకపోవటం
రన్ టైమ్

ఫైనల్ వర్దిక్ట్ : గజి బిజి 'జీబ్రా'