ENGLISH

బాబు బాగా బిజీ తెలుగు మూవీ రివ్యూ

05 May 2017-12:49 PM

తారాగణం: శ్రీనివాస్ అవసరాల, సుప్రియా, మిష్టీ, తేజస్వి, శ్రీముఖి
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
ఎడిటర్:ఉద్ధవ్
కెమెరామెన్: సురేష్ భార్గవ
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: నవీన్ మేడారం  

అడ‌ల్ట్ కంటెంట్ కూడా ఇప్పుడో క‌మ‌ర్షియ‌ల్ వ‌స్తువైపోయింది. `ఏ` స‌ర్టిఫికెట్ సినిమాలు తీయ‌డం, ఓ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డం - కాసులు కురిపించుకొనే మార్గంగా క‌నిపిస్తోంది. ఈ జోన‌ర్‌లో బాలీవుడ్‌లో వ‌చ్చిన కొన్ని చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా బాగానే వ‌సూలు చేసుకోగ‌లిగాయి. ఆ జాబితాలో `హంట‌ర్‌` కూడా క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `బాబు బాగా బిజీ` పేరుతో రీమేక్ చేశారు.  ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే.. తెలుగు ప్రేక్ష‌కులు చీద‌రించుకొనేప్ర‌మాదం ఉంది.  మార్పులూ చేర్పులూ చేస్తే - స్పైసీ త‌గ్గే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ రెంటినీ ఎలా బ్యాలెన్ చేశారు??  హంట‌ర్‌కీ.. ఈ బాబుకీ ఉన్న పోలిక‌లు, తేడా లేంటి?  చూద్దాం.. రండి.

* క‌థ ఎలా సాగిందంటే.?

మాధ‌వ్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) ఓ సాఫ్ట్ వేర ఇంజ‌నీర్‌. ప‌క్కా ప్లే బోయ్‌.  ప్రేమ‌, స్నేహం, డేటింగ్‌, అవ‌స‌రం...పేరు ఏదైనా స‌రే, అమ్మాయిల‌కు ద‌గ్గ‌రై వాళ్ల‌తో కామ‌కేళి సాగిస్తుంటాడు.  పెళ్లీడు దాటేస్తున్న స‌మ‌యంలో... జీవిత భాగ‌స్వామిని వెదుక్కొనే ప‌నిలో ప‌డ‌తాడు.  పెళ్లి చూపుల్లో ప్ర‌తీ అమ్మాయికీ త‌న గ‌తం గురించి చెబుతుంటాడు.  మాధ‌వ్ గతం తెలుసుకొన్న ప్ర‌తీ అమ్మాయి ఛీ కొడుతుంటుంది.  స్నేహితుల కోరిక మేర‌కు రాధ‌  (మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి)కి గ‌తం చెప్ప‌కుండా ద‌గ్గ‌ర‌వుతాడు. ఇద్ద‌రికీ ఆల్మోస్ట్ పెళ్లి సెట్ అవుతున్న త‌రుణంలో రాధ‌కీ ఓ గ‌తం ఉంద‌ని, తాను ఓ అబ్బాయితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింద‌ని తెలుస్తుంది. అప్పుడు మాధ‌వ్ ఎలా రియాక్ట్ అయ్యాడు?  రాధ‌కి త‌న గ‌తం చెప్పేశాడా?  రాధ గ‌తం తెలుసుకొని కూడా ఆమెని పెళ్లి చేసుకొన్నాడా??  మాధ‌వ్ జీవితంలోకి వ‌చ్చిన ముగ్గురు కీల‌క‌మైన అమ్మాయిలు ఎవ‌రు?  వాళ్ల‌తో మాధ‌వ్ సాగించిన ప్రేమ‌క‌థ‌లెలాంటివి? అనేదే.. బాబు బాగా బిజీ క‌థ‌. 

* ఎవ‌రి న‌ట‌న ఎలా ఉందంటే..?

మాధ‌వ్ పాత్ర‌లో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. అత‌ని ఎంపిక స‌రైన‌దే అని నిరూపించుకొన్నాడు. పాత్ర ప్ర‌కారం.. రెండు మూడు షేడ్స్‌లో, గెట‌ప్పుల్లో క‌నిపించాల్సివ‌చ్చింది. ప్ర‌తీ గెట‌ప్‌లోనూ సూటైపోయాడు. 

న‌లుగురు హీరోయిన్లు ఉన్నా... మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి ప్రాధాన్యమే ఎక్కువ‌. త‌ను బాగా చేసింది.  తేజ‌స్విని అందంగా క‌నిపించింది. చంద్రిక హాట్‌గా ఉంది. త‌న‌తో అవ‌స‌రాల ముద్దు సీన్‌.. మాస్‌కి న‌చ్చేస్తుంది. 

ప్రియ‌ద‌ర్శి మ‌రోసారి త‌న టైమింగ్‌తో అల‌రించాడు. అవ‌స‌రాల - ప్రియ‌ద‌ర్శి కాంబోలో వ‌చ్చిన సీన్లు న‌వ్విస్తాయి.

* తెర‌పై ఎలా చూపించారంటే...? 

`హంట‌ర్‌` చూస్తే మరీ టూమ‌చ్‌గా అనిపిస్తుంది. నూనూగు మీసాలు కూడా రాని కుర్రాడు సెక్స్ కోసం వెంప‌ర్లాడ‌డం చూళ్లేం. అలా చూళ్లేని స‌న్నివేశాలు ఆ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. ఆ డోసుని సాధ్య‌మైనంత వ‌ర‌కూ త‌గ్గించుకొంటూ వ‌చ్చారు ఈ రీమేక్‌లో. చెప్ప‌ద‌లచుకొన్న పాయింటే.. లైట‌ర్ వేలో చెప్ప‌డంతో `బాబు` మ‌రీ సెక్సీగా ఏం అనిపించ‌డు. మాధ‌వ్ ప్రేమ క‌థ‌లు, వాళ్ల‌ని ట్రాప్‌లో ప‌డేయ‌డం.. ఇవ‌న్నీ స‌ర‌దాగానే సాగిపోతాయి. హాట్‌, కామెడీ.. ఇవ‌న్నీ మిక్స్ చేస్తూ సీన్లు తెర‌పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. తొలిభాగం కావ‌ల్సినంత టైమ్ పాస్ అయిపోతుంది. సెకండాఫ్‌లో ఎమోష‌న్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. హంట‌ర్ స్క్రీన్ ప్లేనే ఇక్క‌డా ఫాలో అయిపోవ‌డంతో... హిందీ సినిమా చూసిన వాళ్ల‌కు బాబు బాగా బిజీ థ్రిల్లింగ్ గా ఏమీ అనిపించ‌డు. అయితే.. ఏ పాత్ర‌కి ఎవ‌రు స‌రితూగుతారో, వాళ్ల‌నే ఎంచుకోవ‌డం, ప్ర‌తీ సీన్‌.. లైట‌ర్ వేలో చెప్ప‌డంతో సీట్ల‌లో కూర్చోగ‌లుగుతారు.  రీమేక్‌లో ఉన్న సౌల‌భ్యం.. మాతృక‌లో ఉన్న లోపాల్ని కూడా బ‌లాలుగా మార్చుకోవ‌డం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఏమాత్రం ఆలోచించ‌లేద‌నిపిస్తుంది. క‌థ‌ని ఇంకాస్త ప్ర‌భావ‌వంతంగా, ఉత్కంఠ‌భ‌రితంగా చెప్పే అవ‌కాశం ఉన్నా, వినియోగించుకోలేక‌పోయాడు. ప‌తాక స‌న్నివేశాలేం కొత్త‌గా అనిపించ‌వు. 

* టెక్నిక‌ల్‌గా... 

సాంకేతికంగా ఈసినిమా బాగుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్క‌డా రాదు. సునీల్ కాశ్య‌ప్ పాట‌లు థియేట‌ర్ వ‌ర‌కూ ఓకే. కానీ ఎక్క‌డో విన్న పాట‌లే అనిపిస్తాయి. కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకొంటుంది. క‌ల‌ర్ కాంబినేష‌న్ వ‌ల్ల ఈ సినిమాకి కొత్త లుక్ వ‌చ్చింది. డైలాగ్స్‌కి కూడా మంచి మార్కులు ప‌డ‌తాయి. సింగిల్ లైన‌ర్లు ఎక్కువ‌గా వినిపిస్తాయి. రీమేక్ సినిమాని తెర‌కెక్కించ‌డం అంత ఈజీ కాదు. ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచుల ప్ర‌కారం మేకింగ్ సాగాలి. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడికి పూర్తి మార్కులు ప‌డ‌తాయి.

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: వీడు.. ప‌క్కా మ‌ల్టీప్లెక్స్ బాబు 

యూజర్ రేటింగ్: 2.5/5 

రివ్యూ బై: శ్రీ