ENGLISH

ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ & రేటింగ్

16 February 2024-13:21 PM

చిత్రం: ఊరు పేరు భైరవకోన
నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్‌

దర్శకత్వం: వీఐ ఆనంద్‌
నిర్మాతలు: రాజేశ్‌ దండా
 
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: రాజ్ తోట
కూర్పు: ఛోటా కె ప్రసాద్

బ్యానర్స్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య సినిమాలు
విడుదల తేదీ: 16 ఫిబ్రవరి 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5


కాంతార, విరుపాక్ష చిత్రాలతో ఫాంటసీ థ్రిల్లర్స్ కు మళ్ళీ జోష్ వచ్చింది. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన ప్రచార చిత్రాలు కూడా ఫాంటసీ అడ్వంచర్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగించాయి. మరా అంచనాలని ఊరు పేరు భైరవకోన అందుకుందా? ట్రైలర్ లో కనిపించిన థ్రిల్ సినిమాలో కొనసాగిందా ?
 

కథ: బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో డూప్ ఫైటర్. ఒక పెళ్లి ఇంట్లోకి చొరబడి పెళ్లి కూతురి నగలన్నీ దొంగలించి అడవి మార్గం గుండా పారపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ మార్గం నేరుగా భైరవ కోనకి వెళుతుంది. భైరవ కోన ఓ వింత ఊరు. వింత వింత మనుషులు వుంటారు. ఆ ఊరికి వెళ్ళడమే కానీ తిరిగిరావడం వుండదు. అలాంటి వూర్లో ప్రవేశించిన బసవకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? అసలు బసవ దొంగతనం ఎందుకు చేశాడు? ఈ కథలో భూమి( వర్ష బొల్లమ్మ), గీత( కావ్య థాపర్) పాత్రల ప్రాధన్యత ఏమిటి ?ఇవన్నీ తెరపై చూడాలి. 


విశ్లేషణ: దర్శకుడు విఐ ఆనంద్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో లైట్ గా సూపర్  నేచురల్ టచ్ వుంటుంది. అదే జోనర్ కి కాస్త ఫాంటసీ హారర్ మిక్స్ చేసి భైరవ కోన కథని సెట్ చేశాడు. ఈ సినిమా ఐడియా ఎక్సయిటింగానే వుంటుంది. అయితే ఐడియాలోని ఎక్సయిట్మెంట్ తెరపై కనిపించలేదనే చెప్పాలి. ఒక  థ్రిల్లింగ్ ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. తర్వాత హీరో చేసిన దొంగతనం, తప్పించుకునే విధానం, నైట్ ఎఫెక్ట్ లో తీసిన విజువల్స్ ఇవన్నీ ప్రేక్షకుడుని రాబోయే ఫాంటసీ ట్రీట్ కి సిద్ధంగా చేసినట్లుగా వుంటాయి. ఎప్పుడైతే భూమి కథ తెరపైకి వస్తుందో తర్వాత వచ్చిన సన్నివేశాలు సాగదీతగా సాగుతాయి. నిజానికి ఇది భూమి కథ. ఈ కథలో ఎమోషన్ ఆమెదే. ఆ ఎమోషన్ హీరో ముందుకు తీసుకువెళ్తాడు. అయితే ఈ సంగతి చివరి వరకూ ఆడియన్ కి క్లారిటీ ఉండకపోవడంతో ఆ పాత్రలతో అంతగా మమేకమవ్వలేరు. 


ఈ కథకు మంచి ఇంటర్వెల్ బాంగ్ కుదిరింది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెరిగింది. భైరవకోన కథ ఏమిటని తెలుసుకునమే ఆసక్తిలో వున్న ప్రేక్షకుడి కేవలం వాయిస్ ఓవర్ తో నేపధ్యాన్ని చెప్పి ముగించారు. అలాగే గరుడపురాణం అంటూ ట్రైలర్ ఊరించిన డైలాగులు కూడా కేవలం వాయిస్ కే పరిమితమయ్యాయి. భైరవకోన చుట్టూ బలమైన కథ, పాత్రలు లేకపోవడంతో డ్రామా అంత చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. రవి శంకర్ పాత్ర రూపంలో ఇందులో ఒక హారర్ ఎలిమెంట్ వుంది. హారర్ భయపెట్టాలి, లేదా నవ్వించాలి. ఇందులో హారర్ చూసిన తర్వాత నవ్వాలో భయపడాలో అర్ధం కానీ మధ్యస్థ పరిస్థితిలో వుండిపోతాడు ప్రేక్షకుడు. ఇందులో కొన్ని ట్విస్ట్ లు వున్నాయి. దాదాపు ఆడియన్ ఊహకు అవి ముందే అందిపోతాయి. సెకండ్ హాఫ్ లో కథని మరీ సాదాసీదాగా చూపించడం నిరాశపరుస్తుంది. 


నటీనటులు: ప్రేమని కోల్పోయిన కుర్రాడిగా సందీప్ కిషన్ నటన సహజంగా వుంటుంది. చాలా సెటిల్ద్ గా డైలాగులు చెప్పాడు. పాత్రకు ఏం కావో అదే చేశాడు. యాక్షన్ సీన్స్ లో తన యీజ్ బావుంది. వర్ష బొల్లమ్మది కీలకమైన పాత్రే. ఇది ఆమె కథే. తన పాత్రలో ఎమోషన్ కొంత వరకూ వర్క్ అవుట్ అయ్యింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ నవ్విస్తారు. రవి శంకర్ భేస్ ప్లస్ అయ్యింది కానీ ఆ పాత్రలో ఎమోషన్ ఆడియన్ కి పట్టదు. మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి. 


టెక్నికల్: శేఖర్ చంద్ర ఇచ్చిన నిజమే నే చెబుతున్నా.. హమ్మ హమ్మ పాటలు ఆడియో పరంగా హిట్ అయ్యాయి. కానీ సినిమాలో ప్లేస్ మెంట్ సరిగ్గా కుదరలేదు. హమ్మా హమ్మా పాటని ఒక సాగదీత మాంటేజ్ గా వాడుకున్నారు.రాజ్ తోట ఛాయాగ్రహణం డీసెంట్ గా వుంది. విజువల్ ఎఫెక్ట్స్ పర్వాలేదనిపిస్తాయి. కొన్ని డైలాగులు నవ్విస్తాయి. దర్శకుడు విఐ ఆనంద్ కథ, కథనాల విషయంలో ఇంకాస్త బెటర్ గా వర్క్ చేయాల్సింది. 


ప్లస్ పాయింట్స్ 
స్టొరీ ఐడియా 
కొన్ని నవ్వించే సీన్స్ 
ఇంటర్వెల్ బ్యాంగ్ 


మైనస్ పాయింట్స్     
పట్టుతప్పిన కథనం 
పండని ప్రేమకథ 
సాదాసీదా సెకండ్ హాఫ్ 


ఫైనల్ వర్దిక్ట్ : అక్కడక్కడ థ్రిల్ ఇచ్చే భైరవకోన...