ENGLISH

మిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్స్

14 April 2017-14:40 PM

తారాగణం: వరుణ్‌ తేజ, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌, నాజర్‌, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్‌, రఘుబాబు, ఆనంద్‌, పృద్వీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్‌
సినిమాటోగ్రఫీ: కె.వి. గుహన్‌
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు
నిర్మాణం: లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్‌

* కథా కమామిషు..

పెద్ద హీరోలతో వరుసగా రెండు పరాజయాల తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా ఇది. ఆ రెండు పరాజయాలతో స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ పోయిందని ఆయనే స్వయంగా ఒప్పుకోవాల్సిన నేపథ్యంలో తన సత్తా చాటుకోడానికి శ్రీను వైట్ల అత్యంత కసితో ఈ సినిమా చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. కథలోకి వెళ్ళి చూస్తే, స్వీడన్‌లో ఓ కుర్రాడు చై (వరుణ్‌ తేజ), ఓ పల్లెటూరి పెద్ద పిచ్చయ్య నాయుడు (నాజర్‌). స్వీడన్‌లో మీరా (హెబ్బా పటేల్‌) అనే అందమైన భామతో చై ప్రేమలో పడతాడుగానీ, ఆమె తనకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పి, హ్యాండిచ్చేస్తుంది. ఇండియాకి వెళ్ళిన తర్వాత తన ప్రేమకు సమస్యలొచ్చాయంటే మీరా, చై సహాయం కోరుతుంది. దాంతో మీరా కోసం చై, ఇండియాకి వస్తాడు. అలా వచ్చిన చై, చంద్రముఖి (లావణ్య త్రిపాఠి)ని కలుస్తాడు. ఇంకో వైపు ఊర్లో తాతయ్యకు ఎదురైన సమస్యనీ పరిష్కరించే బాధ్యత చై మీద పడుతుంది. ప్రియురాలి కష్టాన్ని తీర్చడం, తాతయ్య సమస్యను పరిష్కరించడం, ఇంకో వైపున చంద్రముఖి - వీటన్నిటి నడుమ చై ఏం చేశాడన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

*నటీనటులెలా చేశారు..

సినిమా సినిమాకీ మెచ్యూరిటీ పెంచుకుంటున్న వరుణ్‌, సక్సెస్‌ ఫెయిల్యూర్‌కి అతీతంగా కొత్త కొత్త 'మార్గాల్ని' అన్వేషిస్తున్నాడు. 'ముకుంద' ఓ సగటు కుర్రాడి కథ. 'కంచె' ఓ విభిన్నమైన చిత్రం. 'లోఫర్‌' కంప్లీట్‌ మాస్‌ క్యారెక్టర్‌. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ పండించే పాత్ర దక్కడంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. లవర్‌ బాయ్‌గా సత్తా చాటాడు. కంప్లీట్‌ హీరో అన్పించుకున్న వరుణ్‌ ఈ సినిమాకి పూర్తిగా అన్నీ తానే అన్నట్లుగా కనిపిస్తాడు.

హీరోయిన్లలో ఇద్దరూ గ్లామర్‌లో పోటీ పడ్డారు. ఒకరు మోడ్రన్‌ లుక్‌తో, ఇంకొకరు ట్రెడిషనల్‌ లుక్‌లో. హెబ్బా పటేల్‌ క్యూట్‌గా ఉంటూనే, హాట్‌ అప్పీల్‌తో స్క్రీన్‌పై కనిపించి మెప్పించింది. సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి తన పాత్రకు అదనపు గ్లామర్‌ తెచ్చింది. ఇద్దరూ నటనలోనూ మెప్పించారు.

తాతయ్య పాత్రలో నాజర్‌ బాగా చేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. విలన్‌ పాత్రని బాగానే తీర్చిదిద్దారు. నటనలోనూ ఫర్వాలేదన్పించాడు విలన్‌ పాత్రధారి. మిగతా నటీనటులంటా సినిమాకి అవసరమైనంత మేర నటన ప్రదర్శించి ఓకే అనిపిస్తారు.

*సాంకేతిక వర్గం పనితీరు..

గుహన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన హైలైట్‌. స్పెయిన్‌ అందాల్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడు. స్పెయిన్‌ లొకేషన్స్‌ చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. యాక్షన్‌ సీక్వెన్సెస్‌, పాటలు అన్నిట్లోనూ సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. మాటలు ఓకే. కథ కొత్తదేమీ కాదుగానీ, చాలా కథల్ని ఇందులో మిక్స్‌ చేసేశారు. దాంతో కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయ్యింది. తెరనిండా పాత్రలూ ఆడియన్స్‌ని కంగారు పెడ్తాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే ఉంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమా రిచ్‌నెస్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా నిర్మాతలు రాజీ పడ్డట్టులేరు. దాంతో క్వాలిటీతో సినిమా తెరకెక్కింది.

*విశ్లేషణ..

చాలా అంచనాల నడుమ సినిమా విడుదలయ్యింది. అంతా శ్రీను వైట్ల మీదనే ఫోకస్‌ పెట్టారు. కొత్తదనంతో కూడిన చిత్రమని చెప్పాడుగానీ, కథలో ఆ కొత్తదనం ఏమీ కన్పించకపోవడం పెద్ద లోటు. తన ట్రేడ్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని సినిమాలో చూపించాలనుకున్నాడుగానీ అది కూడా పూర్తిగా వర్కవుట్‌ కాలేదు. ఓ సాధారణ కథని సూపర్‌ హిట్‌ చేసిన దర్శకుడు శ్రీను వైట్లలో మునుపటి స్పార్క్‌ కొరవడినట్లనిపిస్తుంది. ఫస్టాఫ్‌ ఓకే అనిపించినా అక్కడక్కడా హిక్కప్స్‌ కన్పిస్తాయి. సెకెండాఫ్‌లో అయితే బోల్డన్ని పాత్రలు. ఆ మాటకొస్తే సినిమా నిండా లెక్కలేనని పాత్రల్ని చూస్తాం. అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతుండే పాత్రల తాలూకు భూమిక ఏంటి? అనే కన్‌ఫ్యూజన్‌ సగటు ప్రేక్షకుడిలో కలుగుతుంది. స్పెయిన్‌ సీన్స్‌, హీరో, హీరోయిన్ల ప్రెజెన్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇలా కొన్నింటివరకూ చాలా బాగున్నాయన్పించినా, ఓవరాల్‌గా జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. రిచ్‌నెస్‌తో కూడిన టేకింగ్‌, సినిమాటోగ్రఫీ ఇవన్నీ సినిమాకి అదనపు ఆకర్షణలు.

*ఫైనల్‌ వర్డ్‌..

ఫర్లేదు మిస్టరూ! 

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

రివ్యూ బై: శేఖర్

ALSO READ: మిస్టర్ మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి