ENGLISH

'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ & రేటింగ్

10 June 2022-13:46 PM

నటీనటులు: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల


రేటింగ్: 3.25/5


నాని కథల ఎంపిక బావుంటుంది. నాని నుండి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉటుందనే నమ్మకం ఎప్పటి నుండో కలిగించాడు. వివేక్ ఆత్రేయ కూడా ఇలాంటి దర్శకుడే. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తన మార్క్ ఏమిటో చూపించాడు. మూడో సినిమా నానితో చేసే అవకాశం అందుకున్నాడు. వీరిద్దరికి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ తోడై 'అంటే సుందరానికీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక్కసారి ఈ సినిమా కథలోకి వెళితే..


కథ:


సుందర్ ప్రసాద్(నాని)ది సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం. సుందర్ తండ్రి (నరేషన్)కి మడీ ఆచారం ఎక్కువ. కట్టుబాట్లపై మహా పట్టు. సుందర్ తల్లి(రోహీణీ) కాస్త అభ్యుదయ భావాలు వున్న మనిషే. కట్ చేస్తే.. లీలా థామస్ ( నజ్రియా) ది క్రిస్టియన్ కుటుంబం. లీలా, సుందర్ ఒకే స్కూల్ లో చదువుతారు. చిన్నప్పటి నుండే ఒకరంటే ఒకరి ఇష్టం వుంటుంది. పెద్దయ్యాక ప్రేమించుకుంటారు కూడా. పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే చెప్పు తీసి ఇద్దరిని కొడతారనే సంగతి వాళ్ళుకు బాగా తెలుసు. అందుకే సుందర్ ఒక ప్లాన్ వేస్తాడు. రెండు అబద్దాలు చెప్తాడు. ఏమిటా అబద్దాలు .. రెండు అబద్దాలు లీల సుందర్ లా జీవితాన్ని ఎలా మార్చేశాయి ? చివరికి వాళ్ళ పెళ్లి జరిగిందా ? అనేది మిగతా కథ.


విశ్లేషణ:


కథని అర్ధమవ్వడానికి ఇంత సింపుల్ గా చెప్పడం జరిగింది కానీ ఈ కథ స్క్రీన్ ప్లేయ్ మాత్రం కంప్లీట్ జిగ్ జాగ్. ఒక న్యూ జనరేషన్ స్క్రీన్ ప్లే.. స్కూల్ లో ఒక డ్రామాతో మొదలైన ఈ కథ.. మూడు గంటల పాటు ఫుల్ యంగేజజింగా సాగి.. చాలా రోజుల తర్వాత ఒక కొత్త సినిమా చుశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. నాని నటనకు మరోసారి శేభాస్ అనాలనిపిస్తుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ రాత తీత చూసి ముచ్చటపుడుతుంది.


చాలా బరువైన పాయింట్ ఇది. కానీ ఈ పాయింట్ దర్శకుడు తేలికగా చెప్పిన విధానం అద్భుతంగా హార్ట్ టచింగా వుంటుంది. 'ముందడుగు'' అనే స్కూల్ డ్రామాతో సుందర్, లీలా థామస్ ల నేపధ్యం చెప్పి చదువుకుంటే అందరూ ఒక్కటేగా అనే యాంగిల్ కథ మొదలుపెట్టిన దర్శకుడు.. లీల, సుందర్ పెరిగి పెద్దయిన తర్వాత అదే పాయింట్ ని ప్రధాన సంఘర్షణగా మార్చుకొని.. అభ్యుదయ భావాలు చెప్పడానికి బావుంటాయి కానీ నిజంగా పాటించాల్సివచ్చినపుడు మనుషుల ఎలా రియాక్ట్ అవుతారనే అంశాన్ని చూపించిన విధానం గొప్పగా వుంటుంది.


ఎలాంటి ఇంట్రోలు లేకుండా పాత్రలు ప్రవేశపెట్టడం, సుందర్ పాత్రలో కథని చెప్పుకుంటూ వెళ్ళడం, సన్నీవేశాలని ముందుకి వెనక్కి నడపడం కొత్తగా అనిపిస్తుంది. హర్ష వర్ధన్ పాత్రతో '' ఇంత సింపుల్ కథని ముందుకి వెనక్కి కిందకి మీదకి ఎందుకు చేశావ్'' అనే డైలాగ్ చెప్పిస్తారు. నిజంగా ఈ కథ సింపులే. కానీ ముందుకి వెనక్కి చేయడంలోనే మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. సుందర్ బాల్యం, పెద్దవాడైన సుందర్ ఆఫీస్ లో జరిరిగే సన్నీవేషాలు, అమెరికా యాత్రకు పన్నాగాలు, అటు లీలా పాత్ర అమెరికా ప్రయాణంతో ఇంటర్వెల్ బాంగ్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ ముందుకు వస్తుంది. సుందర్ ఆడిన రెండు అబద్ధాలు పర్వవసనంగా జరిగే సన్నివేశాలు సెంకడ్ హాఫ్ లో వుంటాయి. సెకండ్ హాఫ్ లో చాలా నవ్వులు వుంటాయి. సుందర్ సమస్య గురించి ఇంట్లో చెప్పే సన్నివేశాలు, లీలా లాగేజ్ సుందర్ ఇంట్లో వుండిపోవడం, తండ్రి కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు నవ్విస్తాయి. అబద్దం చెప్పి పెళ్లి చేసుకోవడానికి సుందర్ లీల పడే పాట్లు కొత్తగా వుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపిస్తాయి. ఇరు కుటుంబాలు రెస్టారెంట్ లో కలిసినప్పుడు వచ్చే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే కథ ఊహించినట్లే ముగుస్తుందని ఊహించిన ప్రేక్షకుడికి లీలా పాత్ర ద్వారా ఒక కొత్త ఎండింగ్ ఇచ్చినట్లు చూసుకున్నాడు దర్శకుడు.


ఈ సినిమాలో చాలా సింపుల్ చాలా సింపుల్ గా వుండే సన్నివేశాలు చివర్లో మనసుని మెలిపెడతాయి. సుందర్ నాటకం వేసినప్పుడు గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది తల్లి పాత్ర. అదే సుందర్ బిల్ బోర్డ్ పై కనిపించినపుడు గర్వ పడినట్లు లీలాకి అనిపిస్తుంది. అది గర్వం కాదు. మా అమ్మ గర్వపడితే కన్నీళ్లు వస్తాయి'' అంటాడు సుందర్. అదే సుందర్ హాస్పిటల్ లో లీల తండ్రితో మాట్లాడినపుడు సుందర్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ సీన్ చూస్తే గూస్ బప్స్ వస్తాయి. ఇదీ కదా సీన్ అంటే. ఇది కదా స్క్రీన్ ప్లేయ్ అంటే అనాలనిపిస్తుంది. ఇలాంటి సన్నీవేషాలు సుందర్ చాలా కనిపిస్తాయి. బామ్మ పాత్ర వీణ వాయించి తన అనుమతిని తెలియజేయడం, సుందర్ సమస్యని చూసి తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం, తండ్రి బాధని చూసి సుందర్ కంటతడి.. ఇవన్నీ గొప్పగా వుంటాయి. చాలా క్లీన్ సినిమా ఇది. ఎక్కడా అసభ్యత లేకుండా ఇంత మోడరన్ సినిమా తీసిన చిత్ర యూనిట్ కి మనస్పూర్తిగా అభినందించాలి.


నటీనటులు:


సుందర్ గా నాని ఈ సినిమాని భుజాలపై మోశాడు. నాని నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాని డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఫ్రెష్ గా వుంటుంది. లీలా పాత్రలో నజ్రియా అద్భుతంగా చేసింది. ఇది ఆమెకు ది బెస్ట్ తెలుగు ఎంట్రీ. నరేష్, నదియా, రోహిణి, హర్ష వర్ధన్, రాహుల్ రామకృష్ణ, బామ్మ, చిన్ననాటి లీల సుందర్ గా కనిపించిన నటులు .. ఇలా సినిమాలో కనిపించిన అందరూ చక్కగా చేశారు


టెక్నికల్ :


సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. రిచ్ విజివల్స్. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. ఇలాంటి స్క్రీన్ ప్లేయ్ ఎడిట్ చేయడం అంత తేలిక కాదు. నేపధ్య సంగీతం చాలా ఫ్రెష్ గా వుంది. నిర్మాణ విలువలు బావున్నాయి


ప్లస్ పాయింట్


నాని, నజ్రియా  
కథ, కథనం
వినోదం, ఎమోషన్


మైనస్ పాయింట్స్


అక్కడక్కగా సాగాదీతగా అనిపించే కొన్ని సీన్స్


ఫైనల్ వర్దిక్ట్: అంటే .. బ్లాక్ బస్టర్

ALSO READ: ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచడం తప్పు: సుధాకర్ రెడ్డి