ENGLISH

గాల్లో తేలిపోతున్న గోపీచంద్ మ‌లినేని

30 January 2023-14:17 PM

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ముందుకు వ‌చ్చింది వీర సింహారెడ్డి. రివ్యూల ప‌రంగా మిక్డ్స్ రిజ‌ల్ట్ వ‌చ్చినా, బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాత్రం మంచి వ‌సూళ్ల‌ని అందుకొంది. ముఖ్యంగా బాల‌కృష్ణ అభిమానుల‌కు ఈ సినిమా బాగా న‌చ్చింది. బాల‌య్య సినిమాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా వీర సింహారెడ్డి నిలిచింది. క్రాక్‌, వీర సింహారెడ్డి.. ఇలా వ‌రుస‌గా రెండు భారీ విజ‌యాలతో త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకొన్నాడు గోపీచంద్ మ‌లినేని.

 

ఇప్పుడు ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ ద‌ర్శ‌కుడికి ర‌జ‌నీకాంత్ నుంచి ఫోన్ వ‌చ్చింది. వీర సింహారెడ్డి చూసిన ర‌జ‌నీకాంత్.. త‌న ఆనందాన్ని పంచుకోవ‌డానికి గోపీచంద్ మ‌లినేని ఫోన్ చేశార‌ట‌. సినిమా బాగుందంటూ అభినందించార్ట‌. ఈ విష‌యాన్ని గోపీచంద్ మ‌లినేని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ర‌జ‌నీ ఫోన్ చేయ‌డం మ‌ర్చిపోలేని విష‌య‌మ‌ని, త‌న సినీ జీవితంలో గొప్ప ఎచీవ్ మెంట్ అని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు గోపీచంద్ మ‌లినేని.

 

ఓ సినిమా చూసి, న‌చ్చితే ఫోన్ చేయ‌డం... ర‌జనీ విష‌యంలో అరుదుగా జ‌రుగుతుంటుంది. అందుకే... మేఘాల్లో తేలిపోతున్నాడు గోపీచంద్. మ‌రి... వీరిద్ద‌రి మ‌ధ్యా సినిమా గురించి చ‌ర్చ జ‌రిగిందా? లేదంటే అభినందించ‌డానికే ఫోన్ చేశారా? అనేది తెలియాల్సివుంది. ర‌జ‌నీకాంత్ ఇప్పుడు వేగంగా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌థ న‌చ్చితే కొత్త ద‌ర్శ‌కుల‌కు సైతం అవ‌కాశాలు ఇస్తున్నాడు. మ‌రి గోపీచంద్ కు కూడా పిలుపొస్తుందేమో చూడాలి.