ENGLISH

Hunt Review: హంట్ మూవీ రివ్యూ &రేటింగ్!

26 January 2023-15:00 PM

నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, తదితరులు.

దర్శకుడు : మహేష్ సూరపనేని

నిర్మాతలు: వి ఆనంద ప్రసాద్

సంగీత దర్శకులు: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

 

 

రేటింగ్: 1.5/5

 

 

విభిన్నమైన కథలు ప్రయత్నించే కథానాయకుల్లో సుధీర్ బాబు ఒకరు. సమ్మోహనం చిత్ర ఆయనకి కూల్ లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చింది. వి అనే సినిమాతో యాక్షన్ ని ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు ఆయన నుండి మరో యాక్షన్ థ్రిల్లర్ వచ్చింది . అదే హంట్. మరి ఈ చిత్రం సుధీర్ బాబుకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ? ఈ వేట ఎలా సాగింది ?

 

 

కథ :

 

 

అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) ఆర్యన్ (భ‌ర‌త్‌), మోహ‌న్ (శ్రీ‌కాంత్‌) ముగ్గురూ పోలీస్ అధికారులు. డిపార్ట్ మెంట్ లో ముగ్గురూ మంచి స్నేహితులు. ఆర్యన్‌ని ఎవ‌రో గన్ తో పేల్చి హ‌త్య చేస్తారు. ఆ హ‌త్య కేసుని అర్జున్ ఇన్వెస్టిగేష‌న్ చేస్తుంటాడు. హంత‌కుడు ఎవ‌రో తెలుసుకొంటాడు. అది మోహ‌న్ కి చెప్పేలోగా... అర్జున్‌కి యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ఈ ప్రమాదంలో గ‌తం మ‌ర్చిపోతాడు. కేసు మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుంది. కేసుని మళ్ళీ రీ ఓపెన్ చేసిన అర్జున్ కు ఎలాంటి నిజాలు తెలిశాయి ? హంతుకుడి కోసం ఎలాంటి వేట సాగింది ? చివరికి హంతకుడు దొరికాడా ? అనేది మిగతా కథ.

 

 

విశ్లేషణ :

 

 

మలయాళం వచ్చిన ముంబై పోలీసు చిత్రానికి రిమేక్ హంట్. ఆ సినిమాలో మలయాళంలో పదేళ్ళ క్రితం వచ్చింది. ఆ పదేళ్ళ క్రితం నాటి కథనే పెద్ద మార్పులు ఏమీ లేకుండా హంట్ లో ప్రజంట్ చేశారు. ఇదొక మర్డర్ మిస్టరీ. దీనికి మెమొరీ లాస్ కోణం కూడా తోడైయింది. నిజానికి చాలా మంచి థ్రిల్లర్ ని ప్రజంట్ చేయొచ్చు. కానీ ఇందులో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొరవడ్డాయి. ఇలాంటి క‌థ‌ల్లో కామన్ గా జ‌రిగే కొన్ని విష‌యాలు ఉంటాయి. కొంత‌మంది అనుమానితులు తెర‌పైకి వ‌స్తారు. వాళ్లని విచారణ చేసే క్రమంలో ప్రతి ఒక్కరిపైనా అనుమానం బ‌ల‌ప‌డుతూ ఉంటుంది. చివ‌రికి మ‌రో కొత్త నిందితుడు తెర‌పైకి వ‌స్తాడు. `హంట్‌` కూడా ఇదే మూసలో సాగింది. అయితే ఇది అంత ఆసక్తికరంగా వుండదు. ఈ మర్డర్ కేసు ఎంతకీ ముందుకు సాగదు. దీంతో ఒక దశలో సాగదీత ధోరణి కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పై పెద్ద ఆసక్తి పెంచకుండానే విరామం కూడా వచ్చేస్తుంది.

 

 

సెకండ్ హాఫ్ లో థ్రిల్ ఉటుందని ఆశ పడితే మాత్రం మళ్ళీ నిరాశే ఎదురౌతుంది. నిజానికి సెకండ్ హాఫ్ లో కథనం ను కాస్త బలంగా చేసి విచారణని పరిగెత్తించాలి. కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వుందని కదా .. అది సరిపొతుందనే భావనదర్శకుడిలో కనిపించింది. అయితే ఆ ట్విస్ట్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హంతకుడు అలా చేయడానికి బలమైన కారణాలు చూపించాల్సింది. కానీ దర్శకుడు ఆ దిశగా అలోచించలేదు. మాతృక కథనే యధావిధిగా ఫాలో అయిపోయాడు. ఈ పదేళ్ళలో సమాజంలో వచ్చిన మార్పులు గమనించి వుంటే.. ఈ కథకు ఇంకాస్త భిన్నమైన ట్విస్ట్ తో మలుపుతిప్పే అవకాశం వుండేది. కానీ పదేళ్ళ క్రితం నాటి కథనే గుడ్డిగా నమ్మిన తీరు హంట్ లో కనిపిస్తుంది.  

 

 

నటీనటులు:

 

 

సుధీర్ బాబు ఈ పాత్ర కోసం రిస్క్ చేశాడు. అవుట్ అఫ్ ది బాక్స్ పాత్ర ఇది. అర్జున్ ఏ, అర్జున్ బీ.. ఇలా రెండు కోణాలని చ‌క్కగా ప‌లికించాడు. ప్రేమిస్తే భ‌ర‌త్ చాలా కాలం త‌ర‌వాత తెలుగు తెర‌పై క‌నిపించాడు.

 

శ్రీ‌కాంత్ త‌న పరిణితి చూపించాడు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. ముఖ్యంగా కథ మొత్తం ఈ మూడు పాత్రలు చుట్టూ తిరగడం వలన మరో పాత్ర కూడా పెద్దగా రిజిస్టర్ కాదు.

 

 

టెక్నికల్ :

 

 

నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. యాక్షన్ సీన్స్ ఓకే కానీ మరీ అంత గొప్పగా లేవు. పాట‌ల‌కు స్కోప్ లేదు. ఒక పార్టీ సాంగ్ వుంది. అది కూడా పెద్దగా రిజిస్టర్ కాదు.

 

కెమరాపనితనం బావుంది. అయితే దర్శకుడు కేవలం ఒక ట్విస్ట్ ని నమ్ముకొని ఈ కథని తెరకెక్కించాడు. ఆ ట్విస్ట్ ఈ సినిమాని నిలబెట్టలేకపోయింది. 

 

 

ప్లస్ పాయింట్స్

 

 

సుధీర్ బాబు 

క్లైమాక్స్ ట్విస్ట్ 

 

 

మైనస్ పాయింట్స్

 

 

బలహీనమైన కథనం 

మలుపులు లేకపోవడం 

సాగదీత

 

 

ఫైనల్ వర్దిక్ట్ : గురి తప్పింది!