బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన అక్కినేని - తొక్కినేని కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్య కావాలని అన్నాడా... లేదంటే యధాలాపంగా వచ్చేసిందా..? అనేది పక్కన పెడితే, ఓ మహానటుడ్ని ఇలాంటి పదాలతో కించపరడం మాత్రం ఏమాత్రం భావ్యం కాదు. అందుకే చాలామంది బాలయ్య కామెంట్లని తప్పు పడుతున్నారు. సభా మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేయడమేనా? అంటూ బాలయ్య వైఖరిని దుయ్య బడుతున్నారు. ఇంకొంతమందైతే బాలయ్యకు మాట్లాడడమే రాదని, తాను కూడా కావాలని అన్నది కాదని.. ఏదో నోట్లోంచి వచ్చేసిందని, లైట్ తీసుకోవచ్చని సర్ది చెబుతున్నారు. నిజంగానే బాలయ్య మనసులో ఏదో పెట్టుకొని ఈ కామెంట్లు చేసి ఉండకపోవొచ్చు. కానీ. సోషల్ మీడియాలో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడైనా.. 'నేను కావాలని మాట్లాడింది కాదు' అంటూ ఓ స్టేట్ మెంట్ పడేస్తే సరిపోయేది. బాలయ్య వైఖరి తెలిసివాళ్లంతా.. పెద్దగా పట్టించుకొనేవారు కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో గోల గోల అవుతున్నా... బాలయ్య పట్టించుకోకపోవడం, తన తప్పు ఇంకా తెలుసుకోక పోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎప్పుడూ కామ్ గా ఉండే నాగచైతన్య ఇప్పుడు ఓ సైలెంట్ కౌంటర్ వేశాడు. ఎన్టీఆర్. ఏఎన్నార్ లాంటి మహానుభావుల్నిచులకనగా చేసి మాట్లాడడం మనల్ని మనం తగ్గించుకోవడమే అని.. హితవు పలికాడు. చైతూ ఇచ్చిన కౌంటర్ పద్ధతిగా ఉంది. అఖిల్ కూడా ఇదే పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొన్నాడు. కానీ నాగార్జున నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అసలు మాట్లాడాల్సిన వ్యక్తి అతనే. అక్కినేని వారసత్వాన్ని ముందుండి నడిపిస్తున్న వ్యక్తిగా.. ఈ విషయంపై తను మాట్లాడాలి. కానీ తన కంటే ముందు తనయులు స్పందించారు. ఇదంతా నాగ్ కి తెలియకుండా జరగదు. 'నా బదులు మీరే మాట్లాడండి' అని నాగ్ పుత్రుల్ని రంగంలోకి దించి ఉంటాడు. ఇదే పోస్ట్ నాగార్జున పెడితే... పరిస్థితి వేరేలా ఉండేది. నాగార్జునకీ, బాలయ్యకూ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. బాలయ్యకు సంబంధించిన ఏ విషయంలోనూ... నాగ్ ఎప్పుడూ స్పందించలేదు. కాకపోతే.. ఇప్పుడు కూడా నాగ్ మౌనంగా ఉండడమే అక్కినేని అభిమానుల్ని బాధిస్తోంది. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయకూడదు అని నాగ్ భావించాడా? లేదంటే బాలకృష్ణతో మనకెందుకులే అని ఊరుకొన్నాడా? ఊరుకోవడం నిజమైతే... చైతూ, అఖిల్ ఎందుకు ట్వీట్ చేసుంటారు...? ఇవన్నీ అంతకు చిక్కని ప్రశ్నలే.