ENGLISH

నాగ‌బాబుని టార్గెట్ చేస్తున్నారా?

07 March 2022-13:23 PM

కొన్ని రోజులుగా మోహ‌న్ బాబు కుటుంబానికీ, వాళ్ల సినిమాల‌కు ప‌ని చేసిన నాగ శీనుకీ మ‌ధ్య వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. రూ.5 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువుల్ని దొంగిలించాడ‌ని మంచు కుటుంబం నాగ శీనుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం, త‌న‌ని మోహ‌న్ బాబు కుటుంబ‌మే కులం పేరుతో దూషించింద‌ని నాగ‌శీను ఆరోపించ‌డం తెలిసిన విష‌యాలే. ఈ ఎపిసోడ్ రోజురోజుకీ మ‌లుపు తిరుగుతోంది. నాగ శీనుకి మ‌ద్ద‌తుగా నాయి బ్రాహ్మ‌ణుల సంఘం... బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోహ‌న్ బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ఆ త‌ర‌వాత నాగ‌బాబు ఎంట్రీ ఇచ్చారు. నాగ‌శీను కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక స‌హాయం అందించి, వాళ్ల కుటుంబానికి అండ‌గా నిలిచారు.

 

అయితే.. నాగ‌బాబు తీరుపై మోహ‌న్ బాబు ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. త‌మ హీరోని దూషించిన‌వాళ్ల‌కు నాగ‌బాబు అండ‌గా నిల‌బ‌డ‌డంలో అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అస‌లు ఈ ఎపిసోడ్ లో నాగ‌బాబు త‌ల దూర్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని విరుచుకుప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ కొన్ని పోస్టులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అవి వైర‌ల్ అవుతున్నాయి. క్ర‌మంగా ఈ గొడ‌వ కాస్త మంచు - మెగా ఫ్యామిలీ గొడ‌వ‌గా మార‌బోతోందా? అనే ప్ర‌శ్న రేకెత్తుతోంది.

ALSO READ: డైలామాలో ప్ర‌భాస్ సినిమా