ENGLISH

Rangamarthanda Review: ‘రంగ‌మార్తాండ‌’ రివ్యూ & రేటింగ్!

22 March 2023-10:33 AM

నటీనటులు: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు
దర్శకుడు : కృష్ణవంశీ
నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
సంగీత దర్శకులు: మ్యాస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి
ఎడిటర్: పవన్ వికె


రేటింగ్:3/5


దర్శకుడిగా కృష్ణ వంశీది చాలా విలక్షణమైన శైలి. సింధూరం, ఖడ్గం, మహాత్మా లాంటి సోషల్ ఇంపాక్ట్ కలిగించే సినిమాలు తీశారు. అలాగే ‘నిన్నే పెళ్లాడ‌తా’, మురారి, చందమామ లాంటి క్లాస్ ఎంటర్ టైనర్ లనీ అందించారు. స్టార్లలతో పని చేశారు. అదే సమయంలో కేవలం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. ఇప్పుడు కొంత విరామం తర్వాత ఆయన నుంచి ‘రంగ‌మార్తాండ‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రాఠీ చిత్రం ‘న‌ట‌సామ్రాట్‌’కి రీమేక్‌గా రూపొందింది. కృష్ణ వంశీ కెరీర్ లో తొలి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంది ? అసలు ‘రంగ‌మార్తాండ‌’ కథ ఏమిటి ? 


కథ


రాఘ‌వ‌రావు (ప్రకాశ్‌రాజ్‌) గొప్ప రంగస్థల నటుడు. అభిమానులు, ప్రేక్షకులు ఆయనకు  రంగ‌మార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయ‌న స్నేహితుడు చ‌క్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగ‌స్థల న‌టుడే. ఇద్దరూ ఎంతో స్నేహంగా వుంటారు. రంగారావు భార్య (రమ్యకృష్ణ ) నటన నుంచి విశ్రాంతి తీసుకున్న రాఘవ రావు అదే రోజు  మరో కీలక నిర్ణయం తీసుకుంటాడు. త‌ను సంపాదించిందంతా తన పిల్లలకి ఇచేస్తాడు.  ఇక హాయిగా భార్యతో కలసి శేష జీవితం గడపాలని రాఘవరావుకి జీవితం కొత్త సవాళ్ళని విసురుస్తుంది. తర్వాత రాఘవ రావుకి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థలంపై  అనేక అద్భుతమైన పాత్రలు పోషించిన రాఘవరావు నిజ జీవిత పాత్ర ఎలా ముగిసింది ? అనేది మిగతా కథ. 


విశ్లేషణ


నిజ జీవితంలో మనిషిగా నటించలేని ఓ రంగస్థల నటుడి కథ ఇది. ‘న‌ట‌సామ్రాట్‌’లో ఆత్మని తీసుకొని కృష్ణవంశీ త‌న మార్క్ ట్రీట్ మెంట్ తో తీర్చిదిద్దారు. ఇదేం తెలియని కథ కాదు.. సమాజంలో జరిగే కథే. అయితే  రాఘ‌వ‌రావు, చ‌క్రపాణి, రాజు గారు పాత్రలతో   ప్రేక్షకులు ప్రయాణం అవుతారు. రాఘవరావు కోసం పిల్లలు అన్వేషించే సీన్ తో కథని ఆసక్తిగా మొదలుపెట్టారు. తర్వాత కుటుంబం, చక్రితో స్నేహం, నిజ జీవితంలో నటించలేని రాఘవరావు పాత్ర ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు మనసుని బరువెక్కిస్తాయి.  మారిపోయిన ప‌రిస్థితుల ప్రభావంతో రాఘరావు పడే  సంఘ‌ర్షణ‌ ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తుంది.


సెకండ్ హాఫ్ ఆరంభంలో కథ కొంచెం నెమ్మదించింది. కూతురు ఇంటికి వచ్చిన రాఘవరావు,.అల్లుడు రాహుల్ తో కలసి పాటలు కంపోజ్ చేయడం కథని సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అయితే చక్రి పాత్ర రూపంలో మరో బలమైన అంకానికి తెరలేపి కథని రక్తికట్టించారు కృష్ణ వంశీ. రాఘవ, చక్రిల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా వుంటాయి. ఈ కథకు ముగింపు కూడా చాలా హార్ట్ టచ్చింగ్ గా వుంటుంది. ప‌రిస్థితుల మ‌ధ్యే సంఘ‌ర్షణ‌ని సృష్టించ‌డంలో కృష్ణవంశీ విజయం సాధించారు. 


నటీనటులు


రాఘవరావు పాత్రలో ప్రకాశ్‌రాజ్ పరకాయప్రవేశం చేశారు. రెండు సీన్లు గడిచిన తర్వాత తెరపై వున్నది ప్రకాష్ రాజ్ అనే సంగతి మర్చిపోయే రాఘవ పాత్రతోనే ప్రయనిస్తాం. ఆ పాత్రని అంత సహజంగా గొప్పగా చేశారు . బ్రహ్మానందం చక్రపాణి పాత్ర ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సరికొత్త బ్రహ్మనందంలో ఇందులో కనిపిస్తారు. ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ పాత్రిది.


రాజుగారు పాత్ర లో చేసిన ర‌మ్యకృష్ణ కళ్ళతోనే లోతైన భావాలు పలికించింది. త‌న భ‌ర్తకి అవ‌మానం ఎదురైన‌ప్పుడు ఆమె ప‌డే వేదన‌ కేవలం కళ్ళతోనే చూపించింది. అనసూయ, ఆదర్శ బాలకృష్ణ, శివాత్మిక పాత్రలు కీలకమైనవే. వారి పాత్రల్లో చక్కగా అభినయించారు. రాహుల్ సింప్లిగంజ్ నటుడిగా కొత్తగా అనిపించాడు. మిగతా పాత్రలు పరిధిమేర కనిపించాయి 


టెక్నికల్


ఇళయరాజా పాట‌లు, నేప‌థ్య  సంగీతం క‌థ‌లో భాగంగా సాగుతాయి. పువ్వై విరిసే ప్రాణం పాట అద్భుతంగా కుదిరింది. కెమెరా వర్క్  డీసెంట్ గా వుంది. ఆకెళ్ళ శివ‌ప్రసాద్  బరువైన మాటలు రాశారు.


ల‌క్ష్మీభూపాల్ రాసిన నేనొక నటుడిని షాయరీ కూడా గుర్తుండిపోతుంది. నిర్మాణంలో కొన్ని పరిమితులు కనిపిస్తాయి. గుర్తుండిపోయే సినిమాలు తీయడం కృష్ణ వంశీకి కొత్త కాదు. ఆయన మంచి సినిమాల వరుసలో ‘రంగ‌మార్తాండ‌’ కూడా చేరిపోయింది.


ప్లస్ పాయింట్స్


మనసుని హత్తుకునే కథ 
బలమైన ఎమోషన్స్ 
నటీనటులు 


మైనస్ పాయింట్స్


వాణిజ్య విలువలు తగ్గడం  
కొన్ని చోట్ల ఓవర్ సెంటిమెంట్ 


ఫైనల్ వర్దిక్ట్ : కృష్ణవంశీ ఖాతోలో మరో మంచి సినిమా