ENGLISH

'సిల్లీ'గా హిట్‌ కొట్టేస్తారా.?

10 August 2018-12:45 PM

కామెడీ హీరోలు అల్లరి నరేష్‌, సునీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'సిల్లీ ఫెలోస్‌'. కామెడీ చిత్రాల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కామెడీ హీరోలిద్దరి పరిస్థితి ఏమంత బాగా లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. 

అల్లరోడికి 'సుడిగాడు' సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. 'సుడిగాడు' తర్వాత అల్లరోడి ఖాతాలో ఒక్క హిట్‌ కూడా పడలేదు. అలా చాలా కాలం తర్వాత సెట్‌ అయిన ఈ కాంబినేషన్‌ మరోసారి హిట్‌ కొడుతుందో లేదో చూడాలి మరి. ఇకపోతే సునీల్‌ విషయానికి వస్తే, ఆ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునీల్‌కి ఒక్క సినిమా కూడా హిట్‌ తెచ్చిపెట్టకపోయే సరికి, కాస్త నిమ్మదించాడు. ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. 

హీరోగానే కాకుండా ఇప్పుడు మళ్లీ కామెడీ రోల్స్‌ చేయడానికీ వెనుకాడడం లేదు. సీనియర్‌ హీరోల సినిమాల్లో కామెడీ రోల్స్‌ కోసం ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు కూడా. ఇకపోతే 'సిల్లీ ఫెలోస్‌'లో అల్లరోడితో కలిసి ఇదివరకటిలాగే అల్లరల్లరి చేస్తానంటున్నాడు. 

మరి ఈ ఇద్దరి సిల్లీ అల్లరితో అనుకున్న హిట్‌ని కొట్టగలరా? చూడాలి మరి. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. మరో వైపు అల్లరి నరేష్‌, మహేష్‌బాబు హీరోగా రూపొందుతోన్న 'మహర్షి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ALSO READ: ఎన్టీఆర్‌ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌ ఏంటంటే.!