ENGLISH

ఇలా అవుతోందేంటి అజ్ఞాతవాసీ..!

12 January 2018-13:34 PM

పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటేనే ఓ ప్రభంజనం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'కాటమరాయుడు' తర్వాత పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ పడిపోయిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 'అజ్ఞాతవాసి' సినిమాకోసం అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రేక్షకులు, తమ టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో రెండు షోలు రద్దయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నవారు కూడా థియేటర్ల వద్దకు వచ్చేందుకు సాహసించడంలేదు. సినిమాకి నెగెటివ్‌ టాక్‌ రావడం దీనికి ఒక కారణమైతే, రోజులో 24 గంటలూ సినిమాల్ని ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం ఇంకో కారణం.

మామూలుగా అయితే రోజుకి 4 ఆటలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ఏడు షోలు, ఆ పైన ప్రదర్శితమవుతున్నాయి. దాంతో సహజంగానే ఆ ప్రభావం షోలపై పడుతుంది. రిపీట్‌ వాల్యూ ఉన్న సినిమా అయితే ఫర్లేదేమో. సినిమాకి నెగెటివ్‌ టాక్‌ వచ్చాక, ఇన్ని షోలను ప్రేక్షకులు సైతం భరించడం కష్టం. 200 రూపాయల టిక్కెట్‌ని 100 రూపాయలకి, ఇంకా తక్కువగా 20 రూపాయలు 50 రూపాయలకీ అమ్మేస్తున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తే, తెలంగాణలో ఐదు షోలకి ఇక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్కడా, ఇక్కడా ఒకటే పరిస్థితి కనిపిస్తోంది. 'అజ్ఞాతవాసి' సంగతిలా ఉంటే, ఈ రోజు వస్తున్న 'జై సింహ' పరిస్థితి ఏమవుతుందో. పండగ సీజన్‌ కాబట్టి ఎలాగైనా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేస్తారనుకుంటే పొరపాటేనేమో! ఎందుకంటే ఆడియన్స్‌ మైండ్‌సెట్‌ కూడా మారిపోయింది. ఏదేమైనా పవన్‌కళ్యాణ్‌కి 'అజ్ఞాతవాసి' ఖచ్చితంగా ఓ గుణపాఠమే.

ALSO READ: 'అజ్ఞాతవాసి' మూవీ రివ్యూ & రేటింగ్స్