ENGLISH

Vishwaksen: విశ్వ‌క్ అంత రిస్క్ చేశాడా?

23 March 2023-09:21 AM

విశ్వ‌క్ సేన్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ చిత్రం..`దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాకి దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. ఈ సినిమాకి హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాతగా బాధ్య‌త‌లు కూడా విశ్వ‌క్‌సేన్ తీసుకోవ‌డం విశేషం. సొంత సినిమా కాబ‌ట్టి.. ఈ సినిమా కోసం విశ్వ‌క్ పారితోషికం తీసుకోలేదు. అది కూడా క‌లుపుకొంటే.. బ‌డ్జెట్ ఎక్కువే అయ్యేది. అయితే... విడుద‌ల‌కు ముందే ఈ సినిమాకి మంచి రేటు వ‌చ్చింద‌ని టాక్‌. థియేట‌రిక‌ల్ రైట్స్ ని రూ.20 కోట్ల‌కు కొన‌డానికి ఓ బ‌య్య‌ర్ ముందుకు వచ్చాడ‌ట‌. అంటే.. మంచి బేర‌మే. పెట్టుబ‌డి మొత్తం.. థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలోనే తిరిగి వ‌చ్చేస్తుంది.

 

నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేవ‌న్నీ లాభాలే. ఎవ‌రైనా స‌రే, ఈ డీల్ కి ఒప్పుకొంటారు.కానీ విశ్వ‌క్ మాత్రం `నో` చెప్పాడ‌ట‌. ఈ సినిమాపై త‌న‌కున్న నమ్మ‌కానికి ఇదే నిద‌ర్శ‌నం. అయితే... ఉగాది రోజున విడుద‌లైన ఈ సినిమాకి డివైడ్ టాక్ బాగా వ‌స్తోంది. అంచ‌నాల‌కు అందుకోలేద‌ని, చాలా పాత సినిమాల్ని మిక్సీలో వేసి క‌లిపిన‌ట్టుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కాక‌పోతే.. తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నాయ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. మ‌రో రెండు రోజులు ఆగితే త‌ప్ప‌.. విశ్వ‌క్ తీసుకొన్న నిర్ణ‌యం మంచిదో, కాదో తేలదు.