ENGLISH

సీనియర్‌ డైరెక్టర్స్‌కి అసలేం జరుగుతోంది.?

08 February 2019-14:30 PM

డైరెక్టర్స్‌గా ఎంతో అనుభవం ఉండి, బోలెడంత పాపులారిటీ ఉండి ఒక్క సినిమా ఫ్లాప్‌తో అంతవరకూ ఉన్న ఇమేజ్‌ని దారుణంగా డ్యామేజ్‌ చేసుకుంటున్నారు కొందరు దర్శకులు. మాస్‌లో ఎంతో పాపులారిటీ ఉన్న డైరెక్టర్‌ వినాయక్‌ 'అఖిల్‌' సినిమాతో ఎందుకు దెబ్బ తిన్నాడో ఇంతవరకూ ఎవ్వరికీ అర్ధం కాని విషయం. నిన్న కాక మొన్న త్రివిక్రమ్‌ 'అజ్ఞాతవాసి'తో దెబ్బ తిన్నాడు. అసలు త్రివిక్రమేనా ఇలాంటి సినిమా తీసింది అని ఆశ్చర్యపోయేంతలా ఆ సినిమాని డిజాస్టర్స్‌ లిస్టులో పడేశారు. స్టార్‌ డైరెక్టర్స్‌తో స్టార్‌ హీరోలే బోల్తా కొడుతున్నారు. 

 

'మనం' లాంటి క్రిటికల్‌ కాన్సెప్ట్‌ని అరటి పండు ఒలిచినట్లుగా అందరికీ అర్ధమయ్యేలా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ 'హలో'తో డీలా పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మంచి డైరెక్టర్లు నిరాశ పరుస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అనూహ్యంగా సంచలనమవుతున్నారు. కొత్తదనం ముందు అనుభవం చిన్నబోతోంది. అసలు విషయానికి వస్తే తమిళంలో ఎన్నో మంచి సినిమాల్ని అందించిన ప్రముఖ దర్శకుడు బాల తాజాగా 'వర్మ' సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ తొలి చిత్రమిది. 

 

బాలపై ఎంతో నమ్మకంతో ధృవ్‌ని బాల చేతుల్లో పెట్టాడు విక్రమ్‌. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ కూడా వచ్చింది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ, ఫైనల్‌ వెర్షన్‌లో సినిమాపై చిత్ర యూనిట్‌ అంతా అసంతృప్తి వ్యక్తం చేసింది. విక్రమ్‌ కూడా సినిమాపై అసంతృప్తిగా ఉండడంతో సినిమా విడుదలను అపేస్తున్నామనీ, కొత్త డైరెక్టర్‌తో సినిమా మొత్తం రీషూట్‌ చేస్తున్నామని ప్రకటన విడుదలైంది. దాంతో కోలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాల వంటి దర్శకుడికి ఈ స్థాయిలో అవమానం జరగడంతో ఆయన ఫ్యాన్స్‌ తీవ్రంగా డిజప్పాయింట్‌ అవుతున్నారు.

ALSO READ: సీనియర్‌ స్టార్స్‌ అలా యంగ్‌స్టర్స్‌ ఇలా.!