ENGLISH

సైఫ్ ఆలీఖాన్ పై దాడి.... అసలు ఏం జరిగింది?

16 January 2025-15:15 PM

బాలీవుడ్ స్టార్ హీరో, 'సైఫ్ అలీఖాన్' పై తాజాగా దాడి జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌లకి ముంబై బాంద్రాలోని ఉన్న సైఫ్ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఈ లోగా సైఫ్ మేల్కోవటంతో దొంగని చూసి పట్టుకునే ప్రయత్నం చేసాడు. వెంటనే ఆ దొంగ సైఫ్ పై క‌త్తితో దాడి చేసి అక్క‌డి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌ ను ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలోని లీలావ‌తి హాస్పటల్ లో జాయిన్ చేసారు. సైఫ్ కి ఆరు చోట్ల గాయాలు అయ్యాయని సమాచారం. ప్రజంట్ ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఇప్పటికే పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకొని విచారణ చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఉన్న మిగతాసభ్యులు  క‌రీనా క‌పూర్‌, పిల్ల‌లు క్షేమంగా ఉన్నారు.

సైఫ్ పై జరిగిన దాడిపై పలువురు విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ సైఫ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సైఫ్ పై జరిగిన దాడి పై స్పందిస్తూ సొషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. 'సైఫ్ అలీఖాన్ పై దుండగుడు దాడి చేశాడన్న వార్తతో తీవ్రంగా కలత చెందాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ కూడా సైఫ్ పై జరిగిన దాడికి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలిసి షాకైన‌ట్లు చెప్తూ, సైఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఎక్స్‌లో ఎన్టీఆర్ పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి దేవర మూవీలో నటించారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్రలో సైఫ్ నటించాడు. నెక్స్ట్ ఎన్టీఆర్ దేవరతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు.

నిజంగా ఈ దాడి దొంగతనానికి వచ్చిన దొంగ చేసిందా? లేదా ఇంకేదైనా కోణం ఉందా అన్నది తెలియటం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఈ దాడి పై అఫీషియల్ గా స్పందించలేదు. సైఫ్ ఆరోగ్య పరిస్థితి, ఈ దాడి డిటైల్స్ మరిన్ని వెలువడితే కానీ అసలు నిజాలు తెలిసే అవకాశం లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడటం, దాడి చేయటం మిస్టరీ గా ఉంది.