అభిమానమే హీరోల ఆస్తి. అయితే కొన్నిసార్లు ఆ అభిమానాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం అల్లు అర్జున్కీ అలాంటి పరిస్థితే ఎదురైంది. తన అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సివచ్చింది.
విషయం ఏమిటంటే.. సోమవారం గీతా ఆర్ట్స్ లో.. మీట్ ద ఫ్యాన్స్ అనే ఓ కార్యక్రమం తలపెట్టాడు బన్నీ. ఈ విషయం తెలుసుకుని బన్నీతో ఫొటో తీయించుకోవాలని వేలాదిగా అల్లు అర్జున్ అభిమానులు గీతా ఆర్ట్స్ ముందు ఎగబడ్డారు. ఆ జనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. బన్నీ కోసం వెళ్లినా,... బన్నీ రాలేదని తెలిసి ఫ్యాన్స్ హర్టయ్యారు. దాంతో.. అక్కడ గొడవ, గందరగోళం నెలకున్నాయి. దాంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సివచ్చింది. దాంతో కొంతమంది అభిమానులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
‘నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. మా టీమ్ వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను. మీరు నా పై చూపిస్తున్న ప్రేమే నాకు అతి పెద్ద ఆస్తి’ అని బన్నీ ట్వీట్ చేశారు.
ALSO READ: పుష్పలో.. వీరప్పన్?