ENGLISH

బడ్డీ మూవీ రివ్యూ & రేటింగ్

02 August 2024-17:17 PM

చిత్రం: బడ్డీ 
దర్శకత్వం: శామ్‌ ఆంటోన్‌
కథ - రచన: శామ్‌ ఆంటోన్‌


నటీనటులు:  అల్లు శిరీష్, అజ్మల్ అమీర్, గాయత్రీ భరద్వాజ్ ,  ప్రిషా రాజేశ్‌ సింగ్‌,ముకేశ్ కుమార్, మహమ్మద్ అలీ, ఆలీ తదితరులు 


నిర్మాతలు: జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా


సంగీతం: హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
ఎడిటర్: రూబెన్
ఆర్ట్: ఆర్. సెంథిల్


బ్యానర్: స్టూడియో గ్రీన్‌ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 
విడుదల తేదీ: 2 ఆగస్టు 2024   
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

అల్లు ఇంటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిరీష్ కెరియర్ మొదటి నుంచి డౌన్ లోనే ఉంది. ఒక్క విజయం కోసం తపిస్తున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఇప్పటివరకు సరైన గుర్తింపు లేకుండా ఉన్నాడు. 'ఊర్వశివో రాక్షసివో' పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయినా  విజయం వరించలేదు. రెండేళ్లుగా 'బడ్డీ' రిలీజ్ కి నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ శుక్రవారం బడ్డీ  థియేటర్స్ లో రిలీజ్  అయ్యింది. తమిళంలో ఆర్య, సాయేషా సైగల్ జంటగా వచ్చిన 'టెడ్డీ' కి రీమేక్ గా ఈ మూవీ తెరెకెక్కింది.                   

 

కథ :

ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. ప్రొఫెషన్ లో ఆదిత్యకి మంచి పేరుంటుంది. ఎయిర్ పోర్టులో ఏటీసీగా కొత్తగా చేరిన ప్రియ (గాయత్రి భరద్వాజ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. వృత్తిపరంగా తనకు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచిన ఆదిత్యతో ప్రియ ప్రేమలో పడుతుంది. ప్రియను చూడకుండానే ఆదిత్య ఇష్టపడతాడు. కానీ ఆదిత్యని చూసిన ప్రియ ఒక మంచి సందర్భం చూసి కలవాలనుకుంటుంది. ఈలోపు ఒక మెడికల్ మాఫియా వలలో చిక్కుకున్న ప్రియ కోమాలోకి వెళ్లిపోతుంది. కోమాలో ఉన్నప్రియ ఆత్మ ఆదిత్య  ఇచ్చిన టెడ్డీ బేర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఈ టెడ్డీ బేర్ ఆదిత్యకి దగ్గరవుతుంది. ఆదిత్య ద్వారా ప్రియను కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. టెడ్డీ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? మెడికల్ మాఫియా చేస్తున్న స్కామ్ ఏంటి?  ప్రియ బాడీతో వాళ్లు ఏం చేయాలనుకున్నారు? ఈ ప్రశ్నలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

 

విశ్లేషణ: 

ఇప్పటికే ఈ మూవీ కోలీవుడ్ లో టెడ్డీగా వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ సినిమాని. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. ఒక మనిషి ఆత్మ మరో వ్యక్తి శరీరంలోకి వెళ్ళటం కామన్, కానీ ఈ సినిమాలో ఒక మనిషి ఆత్మ టెడ్డీ బేర్ లోకి వెళ్తుంది. నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఇలా తెర మీద చూపిస్తే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. అందుకే ఈ ఫాంటసీ సినిమాల సక్సెస్ రేట్ బాగుంటుంది. ఫాంటసీ కథల్లో లాజిక్ కూడా ఎవరు పట్టించుకోరు. ఆ విషయం మీదే దర్శకుడు దృష్టిపెట్టాడు. 'బడ్డీ' సినిమా కూడా లాజిక్ కి అందకుండా సాగింది. మనిషి బతికుండగానే ఆత్మ ఒక టెడ్డీలోకి రావటం, ఆ టెడ్డీ హీరోకి దగ్గరై ఆ బాడీ దగ్గరికి తీసుకెళ్తుంది. సేమ్ ఇదే కథ రామ్ , తమన్నా నటించిన 'ఎందుకంటే  ప్రేమంట' సినిమా. అదే కథ ఇది కూడా ఇక్కడ టెడ్డీలో ఆత్మ చేరి, హీరోయిన్ దగ్గరికి చేరుస్తుంది. ఒక ఆత్మ టెడ్డీ బేర్లోకి వచ్చి ఆ బొమ్మ మామూలు మనిషిలాగే తిరగటం, మాట్లాడటం చూస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కానీ పెద్దవాళ్లకి సిల్లీగా అనిపిస్తుంది. టెడ్డీ ఎలా మాట్లాడుతుందని, తిరుగుతుందని అనిపించకమానదు. ప్రాణమున్న ఒక జంతువు అయినా బాగుండేది. కానీ ఒక బొమ్మ నార్మల్ గా వ్యవహరించడమే విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ బొమ్మకు, హీరోకి  మధ్య ఎమోషనల్ కనక్షన్ లేదు. ఇప్పటికే టెడ్డీ సినిమా చూసి ఉండటం వలన ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సాయం చేసాడని హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం, హీరో మాత్రం హీరోయిన్ని చూడకుండానే ప్రేమించటం, ప్రేమించిన అమ్మాయిని కలవడానికి కూడా ప్రయత్నించకపోవటం. కేవలం ఫోన్లో మాట్లాడుతూ తన కోసం ఏమైనా చేసేస్తానని, చెప్పటం పాత కాలం కథలు గుర్తుకువస్తాయి. 


తనది కాని ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి బయలుదేరుతాడు. ఒక టెడ్డీ బేర్ కోసం హీరో ప్రాణాల మీదికి తెచ్చుకుని ఎన్నో సాహసాలు చేసేస్తుంటాడు. అందులో ఉన్నది తనుప్రేమించిన అమ్మాయి ఆత్మ అని కూడా తెలియదు. జై బాలయ్య అంటూ భారీ మెషీన్ గన్  వాడే సీన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టెడ్డీ బేర్ నాటు నాటు డ్యాన్స్ చేయడం లాంటి కొన్ని సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కానీ బేసిగ్గా కథలో కొత్తదనం లేదు. మెడికల్ మాఫియా చుట్టూ బోలెడన్ని కథలు ఉన్నాయి. హీరో హీరోయిన్లతో పాటు విలన్ పాత్రలోనూ ఇక్కడ విశేషం కనిపించదు. నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఏమాత్రం ఉండదు.  

 

నటీనటులు:

తన చివరి చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'లో మంచి హుషారైన పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. కానీ 'బడ్డీ'లో అతను ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది. చాలా వరకు ముభావంగా కనిపించే పాత్రలో శిరీష్ డల్లుగా కనిపించాడు. నటనకి పెద్దగా స్కోప్ లేదు. శిరీష్ పాత్ర ఎగ్జైట్మెంట్ కలిగించేలా లేదు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కు కథలో కీలక పాత్రే  అయినా తగిన గుర్తింపు లేదు. ఒక్కోసారి ఒక్కో లుక్ లో కనిపిస్తుంది. మొదటి అరగంట తరవాత హీరోయిన్ సైడ్ అయిపోయింది. విలన్ గా అజ్మల్ అమీర్ బాగానే చేశాడు. ముకేష్ తనకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కనిపించాడిందులో. కామెడీ టచ్ ఉన్న పాత్రలో మెరిశాడు. ఆలీ ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చి నవ్వించడానికి ట్రై చేశాడు కానీ ఉపయోగం లేదు. 

 

టెక్నికల్ :
తమిళంలో మంచి పేరున్న హిప్ హాప్ తమిళ మ్యూజిక్ టీమ్ తెలుగులో ఇప్పటిదాకా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. 'బడ్డీ' లో కూడా తన ప్రత్యేకతను చాటలేకపోయింది. పాటలు ఒక్కటీ రిజిస్టర్ కావు. కొన్ని పాటలు ఎప్పుడు అయిపోతాయో అనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం కొంచెం డిమ్ గా అనిపిస్తుంది.  తెరంతా మసకబారినట్లుగా విజువల్స్ సాగాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మాములుగా ఉన్నాయి. తమిళంలో నిర్మాతగా మంచి పేరుండి, పెద్ద పెద్ద సినిమాలు తీసే జ్ఞానవేల్ రాజా అల్ రెడీ తీసిన సినిమానే కథ మళ్ళీ ఎందుకు బడ్జెట్ అన్నట్టు లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ శామ్ ఆంటన్ కూడా చాలా నిరాశపరిచాడు. హాలీవుడ్, కోలీవుడ్ లో తీసిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసే ప్రయత్నం చేసి బంగపడ్డాడు. అసలు ఏ ఎమోషన్ లేకుండా రెండున్నర గంటల సినిమా తీసాడు.  

 

ప్లస్ పాయింట్స్ 

అల్లు శిరీష్ 
సెకండ్ హాఫ్ 

 

మైనస్ పాయింట్స్ 

కథ
స్క్రీన్ ప్లే 
ఫస్ట్ హాఫ్  

 

ఫైనల్ వర్దిక్ట్ : పాత కథ రిపీట్ 'బడ్డీ'

ALSO READ: IN ENGLISH