ENGLISH

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు నీరుగారిపోయినట్లే!

07 October 2020-17:30 PM

రియా చక్రవర్తికి డ్రగ్స్‌ కేసులో బెయిలొస్తే, ఆ కేసు నీరుగారిపోయినట్లేనా.? ఇప్పుడు ఈ చర్చ బాలీవుడ్‌తోపాటు ఇండియన్‌ సినీ పరిశ్రమ మొత్తంలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అనుమానాస్పద మరణం, ఆ తర్వాత తెరపైకొచ్చిన డ్రగ్స్‌ కేసుల్లో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తేల్చింది. తాజాగా రియా చక్రవర్తికి బెయిల్‌ వచ్చింది.

 

డ్రగ్స్‌ కేసులో దీపికా పడుకొనే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధాకపూర్‌లను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారించినప్పటికీ, ఈ కేసులో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఇదంతా పద్ధతి ప్రకారం నడిచిన డ్రామాగా చాలామంది అభివర్ణిస్తున్నారు. సుశాంత్‌ డెత్‌ మిస్టరీ కేసుని పక్కదోవ పట్టించేందుకు డ్రగ్స్‌ కేసుని తెరపైకి తెచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ మృతి వెనుక కుట్ర కోణం లేదని తేలిపోయాక, డ్రగ్స్‌ కేసు కూడా నీరుగారిపోయేలా వుందన్నది కొందరు చేస్తున్న ఆరోపణ.

 

అయితే, సుశాంత్‌ మద్దతుదారులమంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రదర్శించిన అత్యుత్సాహం వెనుక ‘పెయిడ్‌ బ్యాచ్‌’ వుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లపైనా విచారణ జరుగుతోందిప్పుడు. దీంతో, ఈ మొత్తం కేసు కొత్త మలుపులు తిరుగుతున్నట్లవుతోంది. బాలీవుడ్‌లో కొందరు అగ్రతారలు డ్రగ్స్‌ బానిసలుగా మారడమే కాదు, డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇంతలోనే ఈ కేసు నీరుగారిపోతుండడం ఆశ్చర్యకరమే.

ALSO READ: వెంకీ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌