ENGLISH

చెన్నైలో 'దర్బార్‌' సందడి మామూలుగా లేదు బాబోయ్‌.!

07 January 2020-14:00 PM

సూపర్‌ స్టార్‌ సినిమా వస్తుందంటే చాలు ఎప్పుడూ అభిమానుల్లో ఉత్సాహమే. అలాంటిది ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న 'దర్బార్‌' సినిమాపై భారీ అంచనాలున్నాయి. మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన తార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా పోస్టర్లలో రజనీ కాంత్‌ మాస్‌, ఊర మాస్‌ స్టిల్స్‌తో ఫ్యాన్స్‌లో ఎక్కడా లేని జోష్‌ నింపేశారు. ఇక విడుదల దగ్గర పడింది. ఆ జోష్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకుంది. జనవరి 9న విడుదల కాబోయే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై నగరమంతా సూపర్‌ స్టార్‌ భారీ కటౌట్స్‌తో నిండిపోయింది. ఇక కొన్ని ప్రభుత్వ సంస్థలయితే, ఆ రోజు తమ సంస్థలకు సెలవులు ప్రకటించేశారు.

 

మరి కొన్ని సంస్థలు ఫ్రీగా టికెట్లు పంపిణీ చేశారు. ధియేటర్స్‌కి దగ్గరగా ఉన్న స్కూళ్లకు రద్దీని దృష్టిలో పెట్టుకుని సెలవులు ప్రకటించేశారు. ఇక మరికొందరు అభిమానులు అయితే, 'దర్బార్‌' సినిమా ప్రదర్శితమయ్యే ధియేటర్స్‌పై హెలికాప్టర్‌ నుండి పూల వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వ అనుమతికి ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ సినిమా విడుదలవుతోందంటే ఈ మాత్రం హంగామా ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ సారి ఇంకాస్త ఎక్కువే అనిపిస్తోంది. చూడాలి మరి, హంగామాకి తగ్గట్లుగా 'దర్బార్‌' హిట్‌ సినిమా అవుతుందో లేదో. అయితే, ఈ హంగామా అంతా కేవలం తమిళనాట మాత్రమే కనిపిస్తోంది. తెలుగులో 'దర్బార్‌' సందడి అంతంత మాత్రమే. ఎందుకంటే, తెలుగులో ఆ తర్వాత రిలీజ్‌ కాబోయే మహేష్‌ 'సరిలేరు..', బన్నీ 'అల..', పైనే అందరి దృష్టీ. అయితే, ఈ రెండింటి కన్నా ముందే వస్తోంది కాబట్టి, 'దర్బార్‌'కీ మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం లేకపోలేదు.

ALSO READ: పూజా హెగ్దే ఎందుకిలా చేశావ్‌?