ENGLISH

టాలీవుడ్ కు ఐటీ గుబులు... బడా నిర్మాతలకు గుండె దడ

21 January 2025-13:05 PM

టాలీవుడ్ కి షాకిచ్చింది ఐటీ శాఖ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్ని టార్గెట్ చేస్తూ అన్ని చోట్లా ఒకే సారి సోదాలు చేపట్టారు ఐటీ అధికారులు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా, బాలయ్య నటించిన  డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజుకి  ఫుల్ ప్రాఫిట్ తెచ్చి పెట్టింది. డాకు మహారాజ్ కి దిల్ రాజు నిర్మాత కాకపోయినా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఈ సినిమా కూడా బాగానే వసూల్ చేస్తోంది.

దిల్ రాజు లక్ కి ఆయన స్ట్రాటజీకి చాలామంది ఫిదా అవుతున్నారు. ఇలా ఒకేసారి తన సినిమాలే మూడు బరిలోకి దింపి ఒక దానితో వచ్చిన నష్టాన్ని రెండో దానితో కవర్ చేశారని పలువురు అభినందిస్తున్నారు. ఈ విజయాన్ని ఆనందించే లోపే మంగళవారం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇలా సడెన్ గా దిల్ రాజుని IT టార్గెట్ చేయటంతో టాలీవుడ్ షాక్ తింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షిత నివాసాల్లో, దిల్ రాజు ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టోటల్ 8 చోట్ల 60 మంది ఐటీ ఆఫిసర్స్ రైడ్ చేసినట్టు సమాచారం.

దిల్ రాజు నివాసంతో పాటు పుష్ప 2 నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఆఫీసుల్లోనూ, నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సింగర్ సునీత భర్త రాముకి చెందిన 'మ్యాంగో' కంపెనీలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు ప్రజంట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  ఉన్నారు. అయినా ఇలా ఐటీ దాడులు జరగటం పలువుర్ని విస్మయానికి గురిచేస్తోంది.