చిత్రం: జాబిలమ్మ నీకు అంత కోపమా
దర్శకత్వం: ధనుష్
కథ - రచన: ధనుష్
నటీనటులు: పవిష్ నారాయణ్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్, శరణ్య ప్రదీప్, శరత్ కుమార్, ఆడుకాలం నరేన్ తదితరులు
నిర్మాతలు: కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: లీయాన్ బ్రిట్టో
ఎడిటర్: జీకే ప్రసన్న
బ్యానర్: వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3/5
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరక్షన్ కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి ఒకటి 'పవర్ పాండి' రెండు 'రాయన్'. ఈ రెండూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దర్శకుడిగా ధనుష్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది రాయన్. ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో వస్తున్న మూడో మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఈ సారి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా లవ్ స్టోరీని చిత్రించాడు. పాన్ ఇండియా కథలు తెరకెక్కతున్న ఈ టైంలో ధనుష్ కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేసాడు. ధనుష్ మేనల్లుడుని హీరోగా పరిచయం చేసాడు. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది. ధనుష్ దర్శకుడిగా మళ్ళీ మెప్పించాడా? ధనుష్ మేనల్లుడు హీరోగా నిలదొక్కుకునే ఛాన్స్ ఉందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
ప్రభు (పవిష్) ఒక చెఫ్. అతనికి నీలా (అనికా సురేంద్రన్)తో బ్రేకప్ అయి బాధలో ఉంటాడు. కొడుకు బాధని చూడలేని తండ్రి (ఆడుకాలమ్ నరేన్) ప్రభు కి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయిని (ప్రియా ప్రకాశ్ వారియర్)ని చూసి ప్రభు ఆశ్చర్య పోతాడు కారణం వారిద్దరూ క్లాస్ మేట్స్. బ్రేకప్ అయ్యి ఎన్ని రోజులు అవని కారణంగా కొన్ని రోజలు ప్రియా తో ట్రావెల్ చేయాలనీ అనుకుంటాడు. ఒకరి గూర్చి ఒకరు తెలుసుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఈ జర్నీలోనే తన లవ్ స్టోరీ గురించి ప్రియకి చెప్తాడు ప్రభు. నీలా కూడా ప్రభును చాలా ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ వీరి ప్రేమకు నీలా తండ్రి (శరత్ కుమార్) ఒప్పుకోడు. అయినా సరే నీల మీద ఉన్న ప్రేమతో ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ కొన్నిరోజులకి సడెన్ గా ప్రభు నిర్ణయం మార్చుకుంటాడు. కావాలని నీలాని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ప్రభు బిహేవియర్ తో విసిగిపోయిన నీలా బ్రేక్ చెప్పి వదలి వెళ్లి పోతుంది. కొన్నాళ్లకు తన వెడ్డింగ్ కార్డుని ప్రభుకి పంపిస్తుంది. ఈ విషయాలన్నీ విన్న ప్రియా ప్రభుని నీలా పెళ్ళికి వెళ్ళమని చెప్తుంది. ప్రభు నీలా పెళ్ళికి వెళ్లిన తరవాత ఏం జరిగింది ? నీలా తండ్రి వీరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకోడు? అసలు ప్రభు నీలా ని ఎందుకు అవాయిడ్ చేసాడు? చివరికి ప్రభు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నటుడిగా ధనుష్ మళ్ళీ మెప్పించాడనే చెప్పాలి. ఇప్పటివరకు ధనుష్ తీసిన మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసాడు. మొదటి సినిమా 'పవర్ పాండి' లో ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి కథను ఆకట్టుకునేలా చెప్పి, ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. రాయన్ లో బాధ్యతగల అన్నయ్యగా, తేడా వస్తే చివరికి వారిని తుదముట్టించే పాత్రలో నటిస్తూ, తనలో మంచి యాక్షన్ డైరెక్టరూ ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీలను కూడా తీయగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. కథలో మలుపులు, ట్విస్ట్ లు లేకపోయినా రొటీన్ కథ అయినా కానీ ప్రేక్షకుడికి బోర్ ఫీల్ రాదు. ఆద్యంతమూ ఫన్నీగా సాగిపోతుంది. ముఖ్యంగా నేటి యువత తీరు తెన్నులు కళ్ళకి కట్టినట్లు ఉంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మలయాళ 'ప్రేమలు' మూవీ తరహాలో జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా మెప్పిస్తుంది. జాలీగా ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయ్యే మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా'.
ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథలు లాగే ఈ కథ ఉంది. ఒకరిని ఒకరు అనుకోకుండా కలవటం ఇష్టం పడడం, అమ్మాయి తండ్రి వీరి ప్రేమకి అడ్డు చెప్పటం, బ్రేకప్, ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాటానికి రెడీ అవటం, పెళ్ళికి వెళ్లిన అబ్బాయిని చూసి అమ్మాయిలో వచ్చిన రియలైజేషన్ ఇదే కథ. ప్రియురాలి పెళ్ళికి వెళ్లిన ప్రియుడ్ని చూసి ఎమోషనల్ అయ్యి చివరికి ఇద్దరూ కలిసి పోతారు అని ముందే ఊహించవచ్చు. కానీ ఫన్నీగా చూపించి సరదా సంభాషణలతో ధనుష్ మెప్పించారు. కేవలం హీరో హీరోయిన్స్ నే ఫోకస్ చేయకుండా హీరో ఫ్రెండ్స్ పాత్రలు కూడా హైలెట్ అని చెప్పాలి. హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన మాథ్యూ థామస్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు. రాజేష్ పాత్ర ద్వారా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసాడు. గోవాలో జరిగే పెళ్లి ఎపిసోడ్ లో రాజేష్ కామెడీ సూపర్.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక పాటలో మెరిసింది. ఒక్క పాటతో ప్రియాంకా కూడా మెప్పించింది. ఇది కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. లవ్ స్టోరీ రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. సీన్స్ కూడా డెప్త్ గా రాసుకోలేదు. అందువల్ల ఎమోషన్ మిస్ అయ్యింది. వాళ్ళు విడిపోయినా బాధ కలగదు, కలిసినప్పుడు కూడా ఆనందం ఉండదు. ముగింపు సినిమాటిక్ గా ఉంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చాడు ధనుష్.
నటీ నటులు:
ఈ సినిమాలో హీరోలంతా కొత్త వాళ్ళే. మెయిన్ లీడ్ చేసిన పవిష్ ధనుష్ మేనల్లుడే. పెద్ద అందగాడు కాదు. చాలా నార్మల్ గా ఉన్నాడు. ప్రభు పాత్రకి సరిపోయేటట్టు ఉన్నాడు. పవిష్ నటన పరంగా పర్వాలేదనిపించుకున్నాడు. మొదటి సినిమా కనక పెద్దగా ఎవరు ఏమి పట్టించుకోరు. కానీ నెక్స్ట్ సినిమాకి పవీష్ నటనకి మెరుగులు దిద్దుకోవాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోయిన్ గా మారిన అనిఖా సురేంద్రన్ ఇంకా చిన్న పిల్లలానే ఉంది. అనిఖ పెర్ఫామెన్స్ కూడా యావరేజ్ గా ఉంది. ఫేస్ లోనూ , నటనలోనూ ఇంకా మెచ్యూరిటీ రావాలి. ప్రియా ప్రకాష్ వారియర్ ఉన్నది కాసేపు అయినా నటన పరంగా ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన మాథ్యూ థామస్ ఈ సినిమాకి ప్రధాన బలం. రాజేష్ పాత్రలో మాథ్యూ చేసిన అల్లరి ప్రేక్షకులకి నచ్చుతుంది. కామెడీ మొత్తం మాథ్యూదే. మిగతా వారంతా వారి పాత్రల పరిధి మేరకు నటించి న్యాయం చేశారు. శరత్ కుమార్, ఆడుగళం నరేన్, శరణ్య లాంటి వాళ్లు మాత్రమే తెలుగు వాళ్ళకి తెలుసు. మిగతావారంతా కొత్త వారే.
టెక్నికల్:
ధనుష్ రైటర్ కమ్ డైరెక్టర్ గా ఇంకోసారి మెప్పించాడు. రొటీన్ కథని తీసుకుని ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగాడు. మొత్తానికి ధనుష్ యూత్ ని బాగానే స్టడీ చేసాడు. యూత్ మనసులు గెల్చుకున్నాడు. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు చాలా ప్లస్. ప్రియాంక మోహన్ చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. సినిమాలో కూడా ఈ సాంగ్ టైమింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ కి ఈ పాట స్పెషల్ గా నిలిచింది. మిగతా పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ సూపర్. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మాథ్యూ థామస్
GV ప్రకాష్ కుమార్
కామెడీ
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
ఎమోషన్ మిస్సింగ్
ఫైనల్ వర్దిక్ట్: యూత్ ఫుల్ మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా'