మా ఎన్నికలలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడతానని చెప్పిన జీవిత అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని, ప్రకాష్‌రాజ్ ప్యానల్ లో వచ్చి చేరారు. అయితే... ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీమ్ లో ఉన్న బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్‌కి హ్యాండిచ్చి - బయటకు వచ్చేశారు. బండ్ల ఇప్పుడు జనరల్ సెక్రటరీ పదవి కోసం జీవితతో పోటీ పడుతున్నారు. బండ్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.
జీవిత వల్లే... తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని బండ్ల గణేష్ బాహాటంగానే ప్రకటించడం కూడా.. షాకింగ్ విషయమే. బండ్ల గణేష్ మెగా కుటుంబానికి విధేయుడు. మెగా ఫ్యామిలీ అంటే నా ప్రాణం అని గతంలోనే చెప్పాడు. జీవిత రాజశేఖర్లకూ మెగా కుటుంబానికి ఏమాత్రం పడదు. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ తన టీమ్ లో జీవితకు చోటిచ్చారో, అప్పుడే బండ్ల ప్రకాష్ రాజ్ టీమ్ నుంచి బయటకు వచ్చేశారు. ''ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా గెలవాలనుకుంటున్నాను. ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ.. జీవితని టీమ్ లో చేర్చుకోవడం నాకు నచ్చలేదు. అందుకే నేను డ్రాప్ అయ్యాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ఱయం'' అని ప్రకటించాడు బండ్ల. మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా బండ్ల నిర్ణయాన్ని సమర్థించారు. ''ఎవరికీ ఇష్టం లేని పనులు చేయలేం కదా. ఆయన ఆత్మసాక్షి చెప్పింది ఆయన చేస్తున్నారు. ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు'' అని తేల్చేశారు.
ALSO READ: నాగ్ పారితోషికం మరీ అంతా...?