ENGLISH

దీపికను మెచ్చుకున్న కంగనా!

08 January 2020-14:06 PM

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'చపాక్‌' చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ సినిమా పట్ల తనదైన రెస్పాన్స్‌ తెలియజేసింది. ఇలాంటి ఓ గొప్ప స్టోరీలో నటించినందుకు దీపికను మనస్పూర్తిగా అభినందిస్తూ 'చపాక్‌' మంచి విజయం సాధించాలని కోరుకుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే తనకు తన సోదరి రంగోలీ గుర్తొచ్చిందంటూ బాధపడింది.

కంగనాని ఎవరైనా ఏమైనా అంటే, సోషల్‌ మీడియా వేదికగా తనదైన శైలిలో చిర్రుబుర్రులాడే రంగోలీ జీవితంలో ఓ చెరగని మచ్చ ఉందనీ, ఆమె కూడా యాసిడ్‌ దాడి బాధితురాలే అనే సీక్రెట్‌ రివీల్‌ చేసింది కంగనా. ఆ బాధ నుండి తప్పించుకోవడం చాలా చాలా కష్టమనీ, రంగోలీపై జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటికీ మా కుటుంబాన్ని బాధిస్తూనే ఉంటుందని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఓ గొప్ప కథని మనకందిస్తున్నందుకు దర్శకురాలు మేఘనా గుల్జర్‌కీ, స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి, ఆ పాత్ర పోషించేందుకు ముందుకొచ్చిన దీపికాకు ధన్యవాదాలు తెలిపింది కంగనా. మరోవైపు కంగనా ప్రస్తుతం 'పంగా' సినిమాలో నటిస్తోంది. కబడ్డీ క్రీడాకారిణిగా కంగనా ఈ సినిమాలో కనిపించనుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి'లోనూ కంగనా లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.

ALSO READ: రెజీనా యాక్షన్‌: డూప్స్‌ లేకుండా!