ENGLISH

ఏప్రిల్ 4న విడుదల కాబోతున్న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)

17 March 2025-15:16 PM

దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి  నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఆ కాపీని చూసి సంతోషించిన మూవీ టీం మీడియాతో మాట్లాడారు. 


డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. "కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథే ఈ సినిమా. ఈ కథ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించాం. హీరో తండ్రి పాత్రలో SP చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది" అని తెలిపారు.


నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. ఈ సినిమాలో దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపించబోతున్నాం. ఫస్ట్ కాపీ చూశాక RR చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగింది. వెంటనే మణి శర్మ  గారిని సత్కరించడానికి వెళ్ళాం. RR బాగా కుదిరినందుకు ఆయన కూడా చాలా సంతోషించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతాం." అని తెలిపారు.


ఇక ఈ సినిమాకు డైలాగ్స్ నాగ మాధురి రాశారు. డీవోపిగా శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ గా రామ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ గా చిడిపల్లి శంకర్, కొరియోగ్రాఫర్ గా మొయిన్, ఫైట్ మాస్టర్ గా కార్తీక్, పిఆర్ఓగా మధు వీఆర్ వ్యవహారించారు.