ENGLISH

బన్నీ వర్సెస్‌ మహేష్‌.. ఎందుకీ 'అగ్లీ' ఫైట్‌!

14 January 2020-09:30 AM

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'తో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' అంటూ సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇద్దరూ నిజానికి ఒకే రోజు బరిలోకి దిగాల్సింది. సినీ పెద్దలు రంగంలోకి దిగి 'కాంప్రమైజ్‌' చేయడంతో ఇద్దరి సినిమాల రిలీజ్‌ల నడుమ ఒక్క రోజు తేడా వచ్చింది. లేదంటే, రెండు సినిమాలూ ఈ నెల 12న పోటీ పడేవి. ఎలాగైతేనేం, రెండు సినిమాలూ విజయాల్ని అందుకున్నాయి. తమ తమ సినిమాల ప్రమోషన్స్‌లో బిజీగా వుండాల్సింది పోయి.. రెండు సినిమాల తరఫున 'పెద్దలు' వసూళ్ళ ఫైట్‌కి తెరలేపారు. ఎందుకిలా? ఈ వ్యవహారానికి హీరోలే కారణమా? లేదంటే, ఇదంతా నిర్మాతల అత్యుత్సాహమా? ఇదేదీ కాదు, అభిమానుల ఓవరాక్షనా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

 

'సరిలేరు నీకెవ్వరు' సినిమాని అల్లు అర్జున్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తే, 'అల వైకుంఠపురములో' సినిమాని మహేష్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు వసూళ్ళ విషయంలో మళ్ళీ రెండు సినిమాల మధ్యా యాగీ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఈ తరహా పోరాటాల్ని చూస్తూనే వున్నాం. ఆ పైత్యమిప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి పాకింది. అన్నట్టు, గతంలోనే ఈ తరహా వివాదాలు టాలీవుడ్‌లో వున్నా, ఇప్పుడవి మరింత తీవ్రరూపం దాల్చాయి. పరిశ్రమ పెద్దలు మళ్ళీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిందే. ఓ సినిమాని ఇంకొకరు ఎంకరేజ్‌ చేసుకునే పరిస్థితి వున్నా, ఎందుకో.. అభిమానుల్ని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. దీన్ని కేవలం అభిమానుల మధ్య ఫైట్‌గా మాత్రమే చూడలేం.

ALSO READ: `ఎంత మంచివాడ‌వురా`హీరో క‌ల్యాణ్‌రామ్ ఇంట‌ర్వ్యూ.