ENGLISH

మాస్‌ మహరాజ్‌ ట్రిపుల్‌ ధమాకా?

10 October 2017-12:05 PM

మాస్‌ మహారాజ్‌ రవితేజ సినిమాలు వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఏడాదికి రెండు మూడు, అయితే నాలుగు సినిమాలతోనూ ఫ్యాన్స్‌ని అలరించే రవితేజ ఈ మధ్య చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. గ్యాప్‌ తీసుకుంటే తీసుకున్నాడు కానీ వరుస పెట్టి సినిమాలతో వస్తున్నాడు. ఇప్పటికే 'రాజా ది గ్రేట్‌', 'టచ్‌ చేసి చూడు' సినిమాలు రవితేజ చేతిలో ఉన్నాయి. 'రాజా ది గ్రేట్‌' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు రవితేజ మరో వినూత్నమైన ప్రాజెక్టును లైన్‌లో పెట్టాడనీ తెలియ వస్తోంది. అదేంటంటే శీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందట. ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్‌ రోల్‌లో నటిస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకి టైటిల్‌గా 'అమర్‌ అక్బర్‌ ఆంథోనీ' పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాలో మూడు విభిన్న క్యారెక్టర్స్‌లో రవితేజ సందడి చేయనున్నాడన్న మాట రవితేజ. రవితేజ గ్యాప్‌ తర్వాత అన్నీ ప్రయోగాత్మక చిత్రాలకే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. 'రాజా ది గ్రేట్‌'లో అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా వస్తున్న గాసిప్స్‌ని బట్టి ట్రిపుల్‌ రోల్‌ కూడా ఓ ప్రయోగమే. గతంలో రవితేజ డబుల్‌ రోల్‌లో వచ్చిన 'బలుపు' సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రిపుల్‌ రోల్‌ అంటే ఫ్యాన్స్‌కి పండగే పండగ. ఫార్ములా సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్‌ శీను వైట్ల ఇప్పుడు ట్రెండ్‌ మార్చాడు. సరికొత్త ట్రెండ్‌తో రవితేజలాంటి హీరోతో తెరకెక్కించబోయే సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకునేలానే ఉండబోతుందనీ ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారమ్‌. జనవరిలో ఈ న్యూ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

ALSO READ: శ్రీదేవి కూతుళ్లు సో హాట్‌ గురూ!