చిత్రం: జాక్
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
కథ - రచన: బొమ్మరిల్లు భాస్కర్
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య, ప్రకాశ్ రాజ్, వీకే నరేష్, రవి ప్రకాశ్, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ తదితరులు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్
సంగీతం: సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ : విజయ్ కే చక్రవర్తి
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్: శ్రీవెంకటేశ్వర్ సినీ చిత్ర
విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోరు మీదున్న సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు జాక్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో అదే ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్ మళ్ళీ జాక్ తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆరాట పడుతున్నాడు. ఈ సినిమా సిద్దు, & భాస్కర్ కి చాలా కీలకం కానుంది. ఈ మూవీలో సిద్ధుకి జోడీగా వైష్ణవీ నటిస్తోంది బేబీ రేంజ్ హిట్ కోసం వైష్ణవి కూడా తపిస్తోంది. మరి ఇందరి కలల్ని జాక్ తీర్చిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
పాబ్లో నెరుడా (సిద్ధూ జొన్నలగడ్డ) అలియాస్ జాక్ బీటెక్ పూర్తి చేస్తాడు. ఎదో ఒక జాబు చేయటం ఇష్టం లేక రా ఏజెంట్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతుంటాడు. ఎప్పుడో జాబ్ వచ్చేవరకు వేయిట్ చేయటం ఎందుకని ఈ లోగా దేశాన్ని కాపాడే పనిలో ఉంటాడు. ఈ క్రమంలోనే 'ఆపరేషన్ బటర్ ఫ్లై' పేరుతో ఓ మిషన్ మొదలుపెట్టి ఒక తీవ్రవాద ముఠా వెంట పడతాడు. జాక్ చేసిన పనుల వల్ల 'రా'లో హైక్యాడర్ లో ఉన్న మనోజ్ (ప్రకాష్ రాజ్) ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తీవ్రవాదిని పట్టుకోవడానికి జాక్ నేపాల్ వెళ్తే మనోజ్ టీం కూడా నేపాల్ వెళ్తుంది. నేపాల్ లో ఏం జరిగింది? సర్జికల్ స్ట్రైక్ లో మనోజ్ చేతుల్లో చనిపోయిన అవుతార్ రెహ్మాన్ (రాహుల్ దేవ్) ఎలా బ్రతికాడు? అసలు అతడి ప్లాన్ ఏంటి ? దాన్ని ఎవరు, ఎలా ఆపారు? జాక్ వెంట తిరిగిన భానుమతి (వైష్ణవి చైతన్య) అలియాస్ ఆప్షాన్ బేగం ఎవరు? భానుమతి కారణంగా కథలో చోటు చేసుకున్న ట్విస్ట్ లు ఏంటి ? చివరికి జాక్ 'రా' లో జాయిన్ అయ్యాడా ? ఉగ్రవాద ముఠాని పట్టుకున్నాడా ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఇది వరకే 'రా' బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. అడవి శేషు గూఢచారి సినిమా, అఖిల్ ఏజెంట్ ఈ తరహా కథలే. శత్రువుల కుట్రలని తెలివిగా, షార్ప్ గా చిత్తు చేసే 'రా' డిపార్ట్ మెంట్ దేశరక్షణలో చాలా కీలకమని తెలిసిన విషయమే. 'రా' లాంటి కీలక వ్యవస్థ దేశ రక్షణలో ఎంత ఏమరుపాటుగా ఉంటుందో? ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో, దేశభద్రత, ప్రతిష్టకి సంబంధించిన వ్యవహారాలు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి కథని తీసుకుని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించటం కొంచెం రిస్క్. సిద్దు కి అచ్చోచ్చిన జోనర్ 'కామెడీ' . పైగా DJ టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్దుకున్న క్రేజ్ ద్రుష్టి లో పెట్టుకుని దర్శకుడు కామెడీ జోనర్ నే ఎంచుకున్నాడని తెలుస్తోంది. సిద్దు సినిమాలపై టిల్లు ప్రభావం ఉంటుంది అనటానికి ఇదే నిదర్శనం. జాక్ లో కొన్ని సీన్స్ టిల్లు ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఉన్నాయి. ఎంత సీరియస్ సిట్యువేషన్ లో అయినా జాక్ కామెడీ చేస్తుండటం కొంచెం అతిగా అనిపిస్తుంది. 'రా' లాంటి వ్యవస్థని అపహాస్యం చేసి, కామెడీతో కూడా మెప్పించలేకపోయారు.
టోటల్ గా రా నేపథ్యాన్ని, రా ఏజెంట్స్‌ని చూపించిన తీరు కొంచెం నిరాశకి గురి చేస్తుంది. కేవలం హీరో పాత్ర, ఫిలాసఫీ బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ కథ నేపాల్ లో స్టార్ట్ అవుతుంది. ప్రేక్షకుడి ఊహకి అందని ట్విస్టులు లేవు. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా లేదు. 'రా' బ్యాక్ డ్రాప్ సినిమాలంటే కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటాయి. జాక్ లో ఆ థ్రిల్ మిస్ అయ్యింది. సీరియస్ మిషన్ లో కూడా కామెడీ చొప్పించటంతో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతారు. జాక్ లో హీరో కామెడీ చేయటంతో మిగతా పాత్రలకి పెద్దగా స్కోప్ లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత ఈజీగా ఫూల్ అయిపోతాడా? 'రా' ఏజెన్సీ సీన్స్ సిల్లీగా తేలిపోయాయి. హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.
నటీ నటులు:
టిల్లు పాత్రలో ఎంత హుషారుగా కనిపించాడో సిద్దు జొన్నలగడ్డ జాక్ లో కూడా అంతే చలాకీగా ఉన్నాడు. టిల్లు పాత్రలొంచి సిద్దు బయటికి రావటం కష్టం. ఆడియన్స్ కూడా సిద్దు అంటే టిల్లు అనే భావనతోనే ఉండిపోతారు. జాక్ లో సిద్దు డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ కొన్ని టిల్లుని తలపిస్తాయి. సిద్దూ లుక్, స్టైల్ బాగుంది. సిద్దు కామెడీ జోనర్ కాకుండా సీరియస్ డ్రామా & యాక్షన్ సినిమాలపై దృష్టిపెడితే మంచిది. హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య బేబీ తరువాత జాక్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ వైష్ణవి పాత్రకి అంతగా స్కోప్ లేదు. స్క్రిన్ పై అందంగా కనిపించి, అలరించింది. భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ ఈ సినిమాలో లేదు. రా ఆఫీసర్ మనోజ్ పాత్రలో ప్రకాష్‌రాజ్ మెప్పించారు. చాలా కాలం తరవాత ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించారు. మిగతా పాత్రలకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
దర్శకుడి ఐడియా బాగున్నా దాని సరిగ్గా అనుసరించలేకపోయారు. ఒక చిన్నపాయింట్ తో కథ నేరేట్ చేయలేకపోయారు భాస్కర్. ఫస్ట్ హాఫ్ స్క్రిన్ ప్లే పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. దర్శకుడు కేవలం హీరో ఇమేజ్‌కి తగ్గ స్క్రిప్ట్ రాసుకున్నాడని అర్థం అవుతోంది. టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫి, సామ్ సీఎస్ బీజీఎం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. పాటలకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. టైటిల్ సాంగ్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. అన్నిటికన్నా కథ, కథనాలు బలహీనంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సిద్దు
వైష్ణవి గ్లామర్
కామెడీ
టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
దర్శకత్వం
కథ, కథనం
పాత్రలకి పెద్దగా స్కోప్ లేకపోవటం
ఫైనల్ వర్దిక్ట్: సిద్దుగాడి క్రాక్ 'జాక్'..