ENGLISH

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

12 October 2020-12:04 PM

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ‌న్ (87) క‌న్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగ‌ళూరులోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. గ‌త కొన్ని రోజులుగా రాజ‌న్ ఆరోగ్య సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

 

రాజ‌న్ అంటే ఎవ‌రికీ తెలియ‌క‌పోవొచ్చు. రాజ‌న్ - నాగేంద్ర అంటే.. ఓ త‌రం సంగీతాభిమానుల‌కు బాగా గుర్తే. ఈ ద్వ‌యం సంగీత ప్ర‌పంచానికి అందించిన ఆణిముత్యాలు ఒక‌టీ, రెండూ కావు. ద‌క్షిణాదిన అన్ని భాష‌ల చిత్రాల‌కూ సంగీతం అందించిన ఈ సోద‌రులు.. తెలుగు సినిమాల‌పై మాత్రం ప్ర‌త్యేక‌మైన మ‌మ‌కారం చూపించారు. ముఖ్యంగా మెలోడీల‌కు రాజన్ - నాగేంద్ర పెట్టింది పేరు. పూజ సినిమాలో `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం - నాదీ నీదీ` పాటని ఆస్వాదించ‌ని సంగీతాభిమాని ఉండ‌డేమో. ఆ సినిమాలోని పాట‌ల‌న్నీ హిట్టే. నాలుగు స్థంభాలాట‌లో `చినుకులా రాలి..` పాట మ‌రో ఆణిముత్యం. ఏమో ఏమో ఇది .. నాకేమో ఏమో ఐనది... (అగ్గిపిడుగు) మ‌రో క్లాసిక్‌. `వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా...` సిరిమల్లె నీవే...విరిజల్లు కావే...వరదల్లే రావే..వలపంతి నీవే, నీ క‌ళ్ల‌లోస్నేహము.. ఇలాంటి అద్భుత‌మైన గీతాలెన్నో వీరిద్ద‌రి నుంచి వ‌చ్చాయి. నాగేంద్ర 2000 సంవ‌త్స‌రంలోనే మ‌ర‌ణించారు. ఇప్పుడు ఆయ‌న సోద‌రుడు కూడా త‌నువు చాలించారు.