టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. కారణం న్యూ ఇయర్ సందర్భంగా తమిళ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన నిర్మాతల చిట్ చాట్ లో సౌత్ ఫిలిమ్స్ సాధిస్తున్న రికార్డ్స్ గూర్చి, ముఖ్యంగా తెలుగు సినిమా గొప్పతనం గూర్చి మాట్లాడాడు. ఈ చిట్ చాట్ లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో ఎక్కువగా నాగ వంశీ చిట్ చాట్ జరిగింది. బాలీవుడ్ సినిమాలు ఇంకా మూస ధోరణిలోనే ఉన్నాయని, సౌత్ సినిమాలు ఇండియన్ సినిమాగా సత్తాచాటుతున్నాయని బాహుబలి, RRR, KGF, కల్కి, సలార్, పుష్ప 2 లాంటి సినిమాల గొప్పతనాన్ని ప్రశంసించాడు నాగ వంశీ.
దీనితో కడుపు మండిన బాలీవుడ్ నాగ వంశీని టార్గెట్ చేసారు. 'తల పాగా చుట్టడం రాని వాడు, తల వంక అన్నాడట' అలా నాగ వంశీ బిహేవియర్ బాగోలేదని, కూర్చోవటం, మాట్లాడటం అన్నింటిపై విమర్శలు కురిపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్ అంతా సొషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని నాగ వంశీని అడగ్గా దానిపై స్పందిస్తూ, బాలివుడ్ వాళ్ళు కావాలని తనని టార్గెట్ చేసారని కారణం తాను సౌత్ సినిమా గొప్పతనాన్ని చెప్పటమే అని తెలిపాడు.
బోనీ కపూర్ కంఫర్ట్ గా కూర్చోవాలని తాను అలా వెనక్కి జరిగి కూర్చున్నానని, దాంట్లో కూడా బాలీవుడ్ వాళ్లు తప్పులు వెతికారని, తాను మాట్లాడిన మాటలు, కూర్చున్నతీరు అన్నీ వాళ్లకి తప్పుగా అనిపించాయని, అది వాళ్ళు చూసే ద్రుష్టి అని స్పష్టం చేసాడు. తాను మాత్రం నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పానని, ఈవెన్ బాలీవుడ్ లో హిట్ అయిన జవాన్, యానిమల్ కూడా సౌత్ ఖాతాలోకే వెళ్తాయని మరొకసారి గుర్తు చేసాడు వంశీ. అసలు మీటింగ్ తరువాత బోనీ కపూర్, తాను చాలా సరదాగా గడిపామని, అవన్నీ బయటకి రావు కదా, బోనీ కూడా నా మాటల్ని పాజిటీవ్ గానే రిసీవ్ చేసుకున్నారని తెలిపాడు నాగ వంశీ.
ఏది ఏమైనా కానీ ఒక నేషనల్ డిబేట్ లో సౌత్ సినిమా గొప్పతనాన్నీ, రికార్డ్స్ ని చెప్తూ, తెలుగు సినిమా వైపు స్టాండ్ తీసుకున్న నాగ వంశీని నెటిజన్స్ కీర్తిస్తున్నారు. బాలీవుడ్ కి బాగా బుద్ధి చెప్పారని, సినిమా అంటే తామే అన్నట్టు అహం చూపిస్తున్న వారి గాలి తీసేశారని ప్రశంసిస్తున్నారు.