ENGLISH

పొట్టేల్ మూవీ రివ్యూ & రేటింగ్‌

25 October 2024-12:53 PM

చిత్రం: పొట్టేల్            
దర్శకత్వం: సాహిత్ మోతుకూరి
కథ - రచన : సాహిత్ మోతుకూరి


నటీనటులు: యువ చంద్ర కృష్ణ,అనన్య నాగళ్ల,అజయ్,నోయల్, ప్రియాంక శర్మ,జీవన్ తదితరులు.  


నిర్మాతలు: నిశాంక్‌ రెడ్డి కుడితి,సురేష్ కుమార్ సడిగే


సంగీతం: శేఖర్ చంద్ర 
సినిమాటోగ్రఫీ : మోనిష్ భూపతి రాజు
ఎడిటర్:  కార్తీక శ్రీనివాస్


బ్యానర్: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌.
విడుదల తేదీ: 25 అక్టోబరు 2024
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

 

గత కొన్నాళ్లుగా విభిన్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు 'పొట్టేల్' మూవీ టీమ్. తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చింది. యువ చంద్ర కృష్ణ , నోయెల్ ముఖ్య మైన పాత్రల్లో నటించిన పొట్టేల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బలగం తరహాలో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందో లేదో చూద్దాం. 


కథ :
1970, 80 ల కాలం కథ ఇది. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో గుర్రంగట్టు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరి గ్రామ దేవత బాల‌మ్మ‌. ఈ దేవతకి పన్నెండు ఏళ్ళకి ఒకసారి  జాత‌ర జరిపిస్తుంటారు. ఈ జాత‌ర‌కీ పొట్టేల్‌ ని బ‌లి ఇవ్వ‌డం ఆ ఊరి ఆన‌వాయితీ. ఇలా రెండు సార్లు జాత‌ర‌ జరిపించాలని అనుకుంటుండగా జాతర ముందే పొట్టేళ్లు చ‌నిపోతాయి. ఊళ్లో క‌రవు తాండ‌విస్తుంది. మూడోసారి మళ్ళీ జాత‌ర‌ జరిపించాలని అనుకుంటారు.  ఇందుకోసం అమ్మ‌వారికి బ‌లి ఇచ్చే పొట్టేల్ పోషణ, బాధ్య‌త‌ల్ని గంగాధ‌రీ (యువ‌చంద్ర కృష్ణ‌)కి అప్ప‌గిస్తారు. గంగాధరీ త‌న బిడ్డ స‌ర‌స్వ‌తి (త‌న‌స్వి) చ‌దువు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. తెలంగాణాలో 1970 , 80 రోజుల్లో ప‌టేల్‌, ప‌ట్వారీ పెత్తనం సాగుతుంటుంది. గుర్రం గట్టుపై కూడా ప‌టేల్ (అజ‌య్‌) ఆధిప‌త్యం చెలాయిస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో అజయ్ చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది. అమ్మ‌వారు బాల‌మ్మ త‌న‌కి పడుతుంది అని చెప్పి ఊరి ప్రజల్ని నమ్మించి దురాగ‌తాల‌కు పాల్ప‌డుతుంటాడు ప‌టేల్‌. అత‌ని నిజ స్వ‌రూపం గంగాధ‌రీకి తెలిసి ఊరి ప్రజలకి చెప్పినా ఎవరు అతని మాట‌ న‌మ్మ‌రు. జాత‌ర ద‌గ్గ‌ర ప‌డుతుండగా గంగాధ‌రీ సంర‌క్ష‌ణ‌లోని పొట్టేల్ మాయం అవుతుంది. దాంతో ప‌టేల్‌తోపాటు, ఊరి జ‌నం గంగాదరీ పై ఆగ్రహంగా ఉంటారు. అమ్మ‌వారి పొట్టేల్‌ని తిరిగి తీసుకు రాకపోతే బ‌డికెళుతున్న గంగాధ‌రీ కూతురు స‌ర‌స్వ‌తిని అమ్మవారికి బ‌లి ఇస్తానంటాడు ప‌టేల్‌. పొట్టేల్ అసలు ఎలా మాయం అయ్యింది? మాయం అయిన పొట్టేల్ ని గంగదారీ తీసుకువచ్చాడా? కూతురి ప్రాణాల్ని ఎలా దక్కించుకున్నాడు? బుజ్జ‌మ్మ పాత్ర ఏమిటి? అన్నది తెర‌పైనే చూడాలి.


విశ్లేషణ: 
ప్ర‌స్తుతం సౌత్ లో పీరియాడిక‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. కన్నడలో వచ్చిన ప్రాంతీయ మూవీ 'కాంతారా' బిగ్గెస్ట్ హిట్ అవటం. మన సంప్రదాయాలకు కూడా ఇంత ఆదరణ లభించటంతో ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి.1980,90ల టైం  క‌థ‌ల‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎలాంటి అంచనాలు లేకుండా, స్టార్ హీరో లేకుండా వచ్చిన తెలంగాణ నేపథ్య చిత్రం 'బలగం'  ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలో  తెలంగాణ నేపథ్య కథలు జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం మన పొట్టేల్ కథ కూడా ఇలాంటిదే. 1970, 80 ల కాలాన్ని, సామాజిక ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా త‌మ క‌థ‌ల్లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అప్పటిలో ఉన్న పొట్టేల్ వ్యవస్థ, బడుగు బలహీన వర్గాలపై పట్వారీ లు చేసే దౌర్జన్యాలు, ప్రజలను బానిస‌లుగా మార్చే ప‌టేళ్లు అక్రమాలు ఈ సినిమాలో చూపించారు. 


కథలో ఒక తండ్రి తన కూతురిని చదివించడం కోసం ఎలాంటి కష్టాలని ఎదుర్కొన్నాడు? చివరికి తన కూతురిని చదివించాడా? అది ఎలా సాధ్యమైంది అనేది పాయింట్. ఈ తరహా కథలు తమిళంలో తెరకెక్కుతుంటాయి. కానీ ఈ సారి తెలుగులో అలాంటి ప్రయత్నం జరగటం అభినందనీయం. రచయితగా సాహిత్ వందకి వంద మార్కులు తెచ్చుకున్నాడు. కానీ ప్రజంటేషన్ లో తడబడ్డాడు. అప్పటి ప్రజల మూఢనమ్మకాలు, చదువుకోసం వారు పడే తాపత్రయం, వారిని చదువుకోనీయకుండా ఉన్నత కులాలు అడ్డుకునే తీరు ఇవన్నీ చాలా కన్వెన్సింగ్ గా  చెప్పగలిగాడు. ఇలాంటి పట్వారీ పెత్తనాలు, అరాచకాలతో సినిమా రూపొందటం ఇదే మొదటి సారి కాదు. ఇది వరకు ఈ నేపథ్యం లో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కూతురి చదువు అన్న పాయింట్ కొత్తగా ఉంది. రాజన్న సినిమాలో పాప పాట పాడటం కోసం పడే తాపత్రయం చూపిస్తే, ఇందులో ఓ తండ్రి కూతురి చదువుకోసం పడే ఆరాటం చూపించారు. కొన్ని మూఢనమ్మకాలు చూపిస్తూనే, మరొకపక్క దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్లు బలులు లాంటివి కోరుకోరు అని చెప్పే ప్రయత్నం చేసారు. తెలుగు ఆడియన్స్ ఆశించే హీరో ఎలివేషన్స్, హీరో ఇజం ఏమి ఉండవు. ఈ కథలో చివరి వరకు హీరో చేతకాని వాడిలా, బలహీనుడిగానే ఉంటాడు. అప్పటి జనరేషన్ కష్టాలు ఇప్పటి జనరేషన్ కి నమ్మశక్యంగా అనిపించవు. నేటి జనరేషన్ కి ఈ సినిమా కనక్ట్ కాకపోవచ్చు. ముఖ్యంగా తెలంగాణకి మాత్రమే ఈ కథ కనక్ట్ అవుతుంది. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ బాగున్నా చెప్పిన విధానంలో కొన్ని  లోపాలున్నాయి. చాలా చోట్ల లాజిక్‌ లు లేవు.


నటీ నటులు:
విలన్ గా నటించిన అజయ్ గూర్చి చెప్పుకోవాలి. ఈ సినిమాకి హీరో అజయ్. తనకిచ్చిన పటేల్ పాత్రలో అజయ్ నటన అద్భుతంగా ఉంది. పటేల్ పాత్రలో అజయ్ పరకాయ ప్రవేశం చేసాడు. ఇదివరకే పలు సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించిన అజయ్ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. దీని తరువాత అజయ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ కావటం ఖాయం అనిపిస్తుంది. అజయ్ కనిపిస్తే చాలు ఆడియన్స్ లో కసి, కోపం మొదలవుతాయి. అంతలా ఆ పాత్రలో జీవించేసాడు. హీరోగా నటించిన యువచంద్ర నటన చాలా బాగుంది, తన పాత్రకి న్యాయం చేసాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. అనన్యకి కూడా మంచి పాత్ర దొరికింది. కూతురుగా నటించిన తన్వికి ఇంకొన్ని అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్,నోయల్ వారి పాత్రలతో  మెప్పించారు. ఇప్పటివరకు కమెడియన్ గా అలరించిన రింగ్ రియాజ్ ఈ సినిమలో ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించాడు.  


టెక్నికల్ :
దర్శకుడు కథని రాసుకున్న విధానం బాగుంది. కానీ తెరకెక్కించటంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. పాత్రల ఎంపిక బాగుంది. చదువుకున్న ఇంపార్టెన్స్, ఆ కాలంలో చదువుకోవటానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చేదో చెప్పే విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా తెలంగాణాలో పటేల్ వ్యవస్థ ఇంత కర్కశంగా సాగిందా అన్నట్టు ఉంది పొట్టేల్. నేటివిటీతో పాటు యాక్ట‌ర్స్ లుక్‌, యాస, భాష‌ల‌తో ఆనాటి కాలాన్ని రీక్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు, టీమ్ స‌క్సెస్ అయ్యారు. గంగాధ‌రి, బుజ్జ‌మ్మ ప్రేమకథ సహజంగా ఉంది. సాగర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. క్లైమాక్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనాన్ని కూడా మెచ్చుకోవలసిందే. 1980 సామాజిక నేపథ్యాన్ని మళ్ళీ రీక్రియెట్ చేసారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా తోడ్పడింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చిన్న సినిమా అయినా శ్రద్దగా ఈ మూవీని తెరక్కించారు. 

 

ప్లస్ పాయింట్స్ 
అజ‌య్ న‌ట‌న
సంగీతం
సినిమాటోగ్రఫీ 


మైనస్ పాయింట్స్ 
కథ 
స్క్రిన్ ప్లే 
మితిమీరిన హింస 


ఫైనల్ వర్దిక్ట్: మంచి ప్రయత్నం..!