ENGLISH

సుకుమార్‌కు షారుఖ్ పిలుపు

18 March 2025-19:34 PM

పుష్ప సిరీస్ తో బాలీవుడ్ లోనూ క్రేజ్ తెచ్చుకొన్నాడు సుకుమార్‌. త‌న నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుందా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ స్టార్లు సైతం సుకుమార్‌తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలో సుకుమార్ కు బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇటీవ‌ల షారుఖ్ ఖాన్ - సుకుమార్ మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ని, వీరిద్ద‌రూ క‌థ గురించి మాట్లాడుకొన్నార‌ని, సుకుమార్ చెప్పిన క‌థ షారుఖ్ కి న‌చ్చింద‌ని, వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.


సుకుమార్ - షారుఖ్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే విష‌యంపై క్లారిటీ రావాల్సివుంది. 'పుష్ప 2' త‌ర‌వాత సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. బుచ్చిబాబు సినిమా పూర్త‌యిన వెంట‌నే చ‌ర‌ణ్‌తో సినిమా మొద‌లెడ‌తాడు సుకుమార్‌. ఈలోగా స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. ఆ త‌ర‌వాత 'పుష్ప 3' ఉంటుంది. ప్ర‌భాస్ తో కూడా సుకుమార్ ప‌ని చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇవ‌న్నీ పూర్త‌య్యే స‌రికి క‌నీసం 4 ఏళ్లు ప‌డుతుంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కూ షారుఖ్ ఆగుతాడా? అనేది ప్ర‌శ్న‌.


మ‌రోవైపు చ‌ర‌ణ్ తో సినిమా పూర్త‌యిన వెంట‌నే షారుఖ్ ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంద‌ని, ఆ తరువాతే ... 'పుష్ప 3' ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ స్ప‌ష్ట‌త రావాల్సివుంది.