ఈ సంక్రాంతి సీజన్... వరుస సినిమాలతో కళకళలాడిపోయింది. మహేష్‌బాబు, అల్లు అర్జున్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు ఈ పండక్కి వినోదాలు పంచడంలో పోటీ పడ్డారు. దాంతో బాక్సాఫీసుకు కొత్త ఊపు వచ్చింది. 12న (ఆదివారం) అల వైకుంఠపురములో విడుదలైంది. 15న (బుధవారం) ఎంత మంచివాడవురా వచ్చింది. గత వారంలో విడుదలైన దర్బార్, సరిలేరు నీకెవ్వరు ల హవా ఈవారంలోనూ కొనసాగింది. ఈవారమంతా ఈ నాలుగు సినిమాల ముచ్చట్టే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. తొలి షోకే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ దక్కింది. బన్నీ నటన, త్రివిక్రమ్ మాయాజాలం, తమన్ పాటలు ఈ చిత్రాన్ని నిలబెట్టేశాయి. త్రివిక్రమ్ సినిమాలు సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంటాయి. పైగా ఇది పండగ సీజన్. ఇవన్నీ అల వైకుంఠపురములోకి కలిసొచ్చిన అంశాలు. తొలి ఆరు రోజుల్లోనే 100 కోట్ల షేర్ సంపాదించుకోగలిగింది. సరిలేరు నీకెవ్వరుకి గట్టి పోటీ ఇస్తూ, వసూళ్లని రాబట్టుకోగలిగింది. నాన్ బాహుబలి రికార్డుల్లో కొన్ని సరిలేరు పట్టుకెళ్లిపోతే, మరికొన్ని 'అల'కు దక్కాయి. మొత్తానికి 2019లో ఒక్క సినిమా కూడా ఇవ్వని బన్నీ, ఆ లోటు తీర్చుకుంటూ ఓసూపర్ హిట్ కొట్టాడు.
మహేష్, బన్నీ సినిమాలతో పోటీ పడుతూ వచ్చిన 'ఎంతమంచివాడవురా' సరైన ఫలితాన్ని అందుకోలేపోయిందనే చెప్పాలి. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన చిత్రమిది. కల్యాణ్ రామ్, మెహరీన్ జోడీ కట్టారు. సీరియల్ టైపు కథనం, అరిగిపోయిన ఫార్ములా, అతకని ఎమోషన్స్‌తో ఈ సినిమా బాగా ఇబ్బంది పెట్టింది. వినోదం కూడా సరిగా పండలేదు. దాంతో... థియేటర్ల నుంచి జనాలు నీరసంగా బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో విడుదల అవ్వడం వల్ల ఎంతో కొంత లాభ పడింది. ఓవర్ ఫ్లోలతో వచ్చిన వసూళ్లే ఈ సినిమాకి ఆసరా. అంతకు మించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినా, అసలు పోటీ మాత్రం సరిలేరు, వైకుంఠపురములో మధ్యలోనే నడిచింది. ఈ రెండింటిలో బన్నీ సినిమాదే పై చేయి అని చెప్పొచ్చు.
ALSO READ: జూనియర్స్‌కి నో చెబుతున్న నయన్.!