ENGLISH

ఫిబ్రవరి లో తెలుగు సినిమాల జాతర

20 January 2025-13:40 PM

కొత్త ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి ఉండటంతో సినిమాలన్నీ పోటీ పడి పండగ బరిలో నిలుస్తాయి. సంక్రాంతి రేసులో పాల్గొనటానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మూడూ 100 కోట్ల  క్లబ్ లో చేరాయి. ముగ్గురు హీరోలు సంతృప్తిగానే ఉన్నారు. జనవరిలో ఈ పండగ సినిమాల విజయోత్సవంలో పడి కొత్త సినిమాలు రిలీజ్ చేయలేదు. ఫిబ్రవరిలో మళ్ళీ సినిమాల జాతర ఉంది. పాన్ ఇండియా సినిమాలు, కేవలం తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న విదామయూర్చి మూవీ తెలుగులో 'పట్టుదలగా' రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ మూవీ వాయిదా పడి ఫిబ్రవరి 6 న రిలీజ్ అవుతోంది. అజిత్ కి జోడీగా త్రిష నటిస్తోంది. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7 న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై నాగ చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా నటిస్తుండటంతో తండేల్ పై భారీ అంచనాలున్నాయి.

ఫిబ్రవరి 14 న మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకే రోజు ముగ్గురు టైర్ 3 హీరోలు పోటీ పడుతున్నారు. విశ్వక్ సేన్ 'లైలా' , కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', బ్రహ్మా నందం కొడుకు గౌతమ్ నటించిన 'బ్రహ్మా ఆనందం' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 21 న సందీప్ కృష్ణ నటించిన 'మజాకా' రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో మన్మధుడు ఫేమ్ 'అన్షు' రీఎంట్రీ ఇస్తోంది. ఇదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం లో తెరకెక్కిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' కూడా రిలీజ్ అవుతోంది. రాయన్ లాంటి బ్లాక్  బస్టర్ మూవీ తర్వాత  ధనుష్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఈ రొమాంటిక్‌ కామెడీ కథలో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటిస్తున్నారు.

ఫిబ్రవరి 21 న తమిళ డబ్బింగ్ మూవీ 'డ్రాగన్' కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, ప్రదీప్ రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 26 న మహా శివరాత్రి సందర్భంగా ‘భైరవం’ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 28 న ఆది పినిశెట్టి 'శబ్దం' తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ జనవరి ప్రయాణం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇక ఫిబ్రవరిలో ఎన్ని హిట్ లు అందుతాయో చూడాలి.

ALSO READ: వెరైటీ టైటిల్ తో నాగ చైతన్య